ఆంజనేయుడి ఆశ్చర్యం

ఆంజనేయుడి  ఆశ్చర్యం
శ్రీరామచంద్రుడికి పరిచయమైన దగ్గర నుంచి సీతతో ఆయన అయోధ్యకు చేరుకునేంత వరకూ హనుమంతుడు చాలా కీలకమైన పాత్రను పోషించాడు. ఈ కారణంగానే ఆయన అటు రాముడి హృదయంలోను ... ఇటు భారతీయుల మనసుల్లోను చెదరని స్థానాన్ని సంపాదించుకున్నాడు. అలాంటి హనుమంతుడు, రామాయణం మొత్తంమీద రెండుసార్లు ఆశ్చర్యపోయినట్టు ప్రముఖుల రచనలను బట్టి తెలుస్తోంది.

లంకా నగరంలో గల అశోకవనంలోని సీతను కలుసుకుని ఆమెకి తన విశ్వరూపాన్ని చూపించాడు హనుమంతుడు. తన భుజంపై కూర్చుంటే క్షణాల్లో ఆమెను శ్రీరాముడి చెంతకు చేరుస్తానని చెప్పాడు. అందుకు సీత నిరాకరించింది. రామలక్ష్మణులు లేని సమయంలో రావణుడు తనని దొంగచాటుగా తీసుకొచ్చాడనీ, అలాగే రావణుడు లేని సమయం చూసి తాము దొంగచాటుగా పారిపోవడం సమంజసం కాదని చెప్పింది. ఈ విధంగా చేయడం వలన రావణుడికి ... తమకి పెద్ద తేడా ఉండదని అంది. ఆ మాటల్లోని యదార్థాన్ని గ్రహించిన హనుమంతుడు, పరిణతితో కూడిన ఆమె ఆలోచనా విధానం చూసి ఆశ్చర్యపోయాడట.

ఆ తరువాత రావణుడితో యుద్ధం జరుగుతోన్న సమయంలో, హనుమంతుడు తన బలాన్నంతటిని ఉపయోగించి ఆయన ఛాతిపై కొట్టాడు. ఆ దెబ్బకు కొన్ని అడుగుల దూరం వెనక్కి వెళ్లిన రావణుడు, హనుమంతుడి వైపు మెచ్చుకోలుగా చూశాడు. గతంలో తాను హనుమంతుడి శక్తిని గురించి విన్నాననీ, ఇప్పుడు ప్రత్యక్షంగా తెలుసుకున్నానని అన్నాడు. ఆయన అంతగా ప్రశంసించినా హనుమంతుడికి ఆనందం కలగలేదు. అంతవరకూ తన దెబ్బకు తట్టుకుని బతికినవారు లేరు ... అలాంటిది రావణుడు ఆ దెబ్బను తట్టుకుని నిలబడటమే కాకుండా, తనని ప్రశంసించడంతో హనుమంతుడు మరోసారి ఆశ్చర్యపోయాడట.

More Bhakti Articles