విఘ్నహర గణపతి

విఘ్నహర గణపతి

విఘ్నహర గణపతి
అష్ట గణపతులలో ఒకటైన 'విఘ్నహర గణపతి' క్షేత్రం ... పూణే జిల్లాలోని జున్నర్ తాలూకాలోని 'ఓఝర్' అనే గ్రామంలో 'కూకడీ' అనే నదీ తీరంలో విరాజిల్లుతోంది. విఘ్నాలను హరించడం కారణంగా ... విఘ్నాసురుడు అనే రాక్షసుడిని ఎదుర్కున్న కారణంగా ఇక్కడి స్వామివారికి ఈ పేరు వచ్చిందని చెబుతుంటారు.

విశాలమైన ఆలయ ప్రాంగణం ... ఆహ్లాదకరమైన వాతావరణం అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తాయి. ఇక వజ్రాలతో పొదగబడిన స్వామివారి కళ్ల గురించి అంతా విశేషంగా చెప్పుకుంటూ వుంటారు. ఇక్కడ స్వామివారు ఆవిర్భవించడం వెనుక గల పురాణ గాధలోకి వెళితే ... పూర్వం అభినందుడనే రాజు విరివిగా యజ్ఞ యాగాదులు నిర్వహిస్తూ ఉండటంతో, దేవేంద్రుడికి తన పదవిని గురించిన భయం పట్టుకుంది. దాంతో విఘ్నాసురుడు అనే రాక్షసుడిని అతని పైకి ఉసిగొల్పాడు.

అభినందుడు నిర్వహిస్తోన్న యజ్ఞ యాగాదులను ఆ రాక్షసుడు ధ్వంసం చేయడం మొదలు పెట్టాడు. అభినందుడు వినాయకుడిని ప్రార్ధించగా ఆయన ప్రత్యక్షమై, విఘ్నాసురుడిని శక్తి హీనుడిని చేశాడు. వినాయకుడి పరాక్రమాన్ని కీర్తించిన విఘ్నాసురుడు ఆ ప్రదేశంలో కొలువై ఉండవలసిందిగా కోరడంతో, అందుకు వినాయకుడు అంగీకరించాడు. ఫలితంగా 'విఘ్నహర గణపతి' అనే పేరుతో ఈ క్షేత్రం ప్రసిద్ధమైందని స్థల పురాణం చెబుతోంది.

More Bhakti Articles