చింతామణి గణపతి

చింతామణి  గణపతి
భక్తుల చింతలు తీరుస్తూ ... వారిచే 'చింతామణి గణపతి'గా విశేష పూజలు అందుకుంటోన్న ఈ క్షేత్రం, పూణే జిల్లా హవేలీ తాలూకాలోని 'ధేవూర్'లో వెలసింది. ఈ క్షేత్రం ఇక్కడ ఆవిర్భవించడానికి గల కారణాన్ని స్థలపురాణం చెబుతోంది. పూర్వం అభిజిత్తు - గుణవతి అనే రాజ దంపతులకు ఓ మగబిడ్డ జన్మించాడు. ఆ దంపతులు అతనికి గణరాజు అనే పేరు పెట్టారు.

యుక్త వయస్కుడైన గణరాజు, ఓ రోజున తన పరివారంతో కలిసి వేటకు వెళ్లాడు. విపరీతమైన ఎండగా వున్న కారణంగా 'కపిలమహర్షి' ఆశ్రమంలో సేదదీరాడు. ఆ సమయంలోనే కపిలమహర్షి దగ్గర ఉన్న 'చింతామణి'ని చూశాడు. కోరిన కోరికలను తక్షణమే తీర్చే ఆ చింతామణిని తనకి ఇవ్వమని అడిగాడు. అందుకు కపిలుడు నిరాకరించడంతో బలవంతంగా దానిని తీసుకుపోయాడు.

దాంతో కపిలుడు విఘ్నేశ్వరుడి అనుగ్రహాన్ని కోరుతూ తపస్సు చేశాడు. వినాయకుడు ప్రత్యక్షం కావడంతో జరిగింది వివరించి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. దాంతో వినాయకుడు ... గణరాజును సంహరించి, ఆ చింతామణిని కపిలుడికి అప్పగించాడు. కపిలుడి ప్రార్ధన మేరకు ఆ ప్రదేశంలోనే స్వయంభువుగా వెలిశాడు. నాటి నుంచి నేటి వరకూ భక్తుల అభీష్టాలను నెరవేరుస్తూ నిత్య నీరాజనాలు అందుకుంటున్నాడు.

More Bhakti Articles