శిరిడి

భారతీయుల ఆధ్యాత్మిక జీవన విధానం పై తిరుగులేని ప్రభావం చూపిన అవతార పురుషుడు శ్రీ శిరిడీ సాయిబాబా. అందరినీ ప్రేమిస్తూ ... ఆప్యాయంగా పలకరిస్తూ ఫకీరు అనిపించుకున్న సాయి .. నేడు ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి చక్రవర్తిగా పూజలు అందుకుంటున్నాడు. ఆయన తిరుగాడిన శిరిడీ నేడు దివ్య క్షేత్రమై అలరారుతోంది.

బాబా ఏనాడూ ఎవరి నుంచి ఖరీదైన కానుకలు ఆశించలేదు ... తన పేరు దశ దిశలా వ్యాపించాలని ఆరాటపడలేదు. ధర్మానికి ప్రతీకగా శ్రీ రాముడిని చూపించినట్టే, నిరాడంబరతకు .. నిస్వార్ధానికి ప్రతీకగా బాబాను చూపించవచ్చు. 'దేవుడు పార్థ సారధి ... మనిషి అపార్థ సారధి' అన్నాడో మహనీయుడు. అలా ఆ రోజుల్లోనే అనేక మంది బాబాను పరీక్షించడానికి నానారకాలుగా ప్రయత్నించారు. అలాంటి వారందరూ ఆయన దైవాంశ సంభూతుడని తెలుసుకుని భక్తులుగా మారిపోయారు.

తానెవరో ... తన తల్లిదండ్రులెవరో ... తన స్వగ్రామమేదో చివరి వరకూ బాబా ఎవరికీ చెప్పలేదు. సర్వమత సమానత్వాన్ని చాటిచెబుతూ మత సామరస్యానికి మహావేదికగా నిలిచాడు. కేవలం అయిదు ఇళ్లలో మాత్రమే బిక్ష అడిగి తెచ్చుకుని దానిని మూగ జీవాలకు పంచి, మిగతాది తాను తినేవాడు. తన దగ్గరికి ఆడంబరంగా వచ్చే వారి కన్నా అంకిత భావంతో వచ్చిన వారినే ఆయన అనుగ్రహిస్తూ వచ్చాడు. భక్తులు కోరుకున్న రూపాల్లో దర్శనమిచ్చి తాను సకల దైవ స్వరూపమని చెప్పకనే చెప్పాడు.

ఈ నేపథ్యంలో ఆయన శిష్యులుగా ... సహచరులుగా మహల్సా పతి ... లక్ష్మీ బాయి షిండే ... తాత్యా ... శ్యామా ... దాదాసాహెబ్ కేల్కర్ ... నిమోంకర్ ... నానా సాహెబ్ డేంగ్లే ... దీక్షిత్ మొదలైన వారు వుండేవారు. వీరంతా బాబాను కంటికి రెప్పలా చూసుకునే వారు. ఇక బాబా వారిని పసిపిల్లల మాదిరిగా చూసుకునే వారు. వీరందరి భక్తి పునాదుల పైనే నేటి శిరిడీ గ్రామం నిలిచింది.

బాబా ఎప్పుడూ ఎవరికీ ఎలాంటి మంత్రోపదేశాలు చేయలేదు. విష్ణు సహస్ర నామం చదువుకోమనీ ... 'గురుపౌర్ణమి'ని గుర్తుంచుకోమని మాత్రమే చెప్పాడు. బాబా శిరిడీ వచ్చిన 60 సంవత్సరాలకి అంటే 1918లో విజయదశమి రోజున ఆయన 'మహా సమాధి' చెందాడు. 'బూటీవాడ'లోని ఆయన సమాధి మందిరం పైనే 1954లో బాబా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అయితే ఇది కేవలం పాలరాతి విగ్రహమంటే ఎవరూ ఒప్పుకోరు. ఆయన ఇక్కడ ప్రత్యక్షంగా కూర్చుని ఉన్నాడనే విశ్వసిస్తుంటారు.

బాబా చూపులో ప్రేమ - కరుణ భక్తుల హృదయాలను సున్నితంగా స్పర్శిస్తుంటాయి. అందుకే ఆయన ఎదురుగా నిలిచి కన్నీళ్లు పెట్టుకోకుండా కదిలేవారు కనిపించరు. పిలిస్తే పలికే దైవంగా బాబాకి భక్తుల సంఖ్య పెరిగిపోతోంది. ఇందుకు అనుగుణంగానే ఆలయ అభివృద్ధి కూడా జరుగుతోంది. ఇక్కడ బాబాకి అనునిత్యం అభిషేకాలు ... హారతులు ... పల్లకి సేవలు ఘనంగా జరుగుతుంటాయి.

వివిధ రాష్ట్రాల నుంచి వేలాదిగా వస్తోన్న భక్తులతో శిరిడీ ఒక భక్తి సామ్రాజ్యంగా కనిపిస్తుంది ... ఒక ముక్తి క్షేత్రమేనని అనిపిస్తుంది. బాబా తిరుగాడిన ప్రదేశాలు ... ఆయన తొలిసారిగా వేపచెట్టు కింద ధ్యానంలో కూర్చున్న 'గురు స్థానం' ... 'ద్వారకామాయి' లో ఆయన వెలిగించిన 'ధుని' ... ఆయన హరతులను మొదటి సారిగా విన్న 'చావడి' ... సాయి ఉపయోగించిన వస్తువులను చూడటం మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది ... మనసుని మాలగా చేసి సాయి పాదాల చెంత సమర్పించాలనిపిస్తుంది.


More Bhakti News