శనీశ్వర క్షేత్రం

శనీశ్వర క్షేత్రం
శని పట్టుకుంటే అంత తేలికగా వదలడని అంతా భయపడుతూ వుంటారు. జాతకంలోకి శని ప్రవేశించాడని తెలిస్తే చాలు దిగాలు పడిపోతుంటారు. శనికి శాంతి చేయించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే శని అనుగ్రహాన్ని సంపాదించుకుంటే, ఆయన ద్వారా ఎదురయ్యే పరిణామాల తీవ్రత తగ్గుతుందని 'పావగడ' భక్తులు చెబుతున్నారు.

కర్ణాటక రాష్ట్రం తుముకూరు జిల్లాలోని ఈ గ్రామంలో శనీశ్వరుడు కొలువై ఉన్నాడు. చాలకాలం కిందట ఈ ప్రాంతమంతా అంటూ వ్యాధులు వ్యాపించడంతో, వేల సంఖ్యలో మనుషులతో పాటు జంతువులు కూడా చనిపోయాయి. పావగడలో మరణాల సంఖ్య పెరిగిపోతూ ఆ ఊరు ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది.

అలాంటి పరిస్థితుల్లో ఆ గ్రామస్తులంతా ఆలోచనలో పడ్డారు. శని ఆగ్రహించిన కారణంగానే ఇదంతా జరుగుతుందని భావించి, ఒక ప్రదేశంలో ఆయన ప్రతిమ నుంచి పూజలు చేయడం మొదలు పెట్టారు. ఊహించని విధంగా ఆ ప్రాంతం నుంచి అంటూ వ్యాధులు వదిలిపోయాయి. శనీశ్వరుడి అనుగ్రహమే అందుకు కారణమని భావించి, ఆ ప్రదేశంలో నవగ్రహాలయాన్ని నిర్మించారు. కాలక్రమంలో ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధిచెందింది.

శనీశ్వరుడి అనుగ్రహానికి పాత్రులైన వారు, 'నల్లబంగారం' పేరుతో తలనీలాలు సమర్పిస్తుంటారు. ఏలినాటి శనితో బాధపడేవారు సైతం ఈ క్షేత్రాన్ని దర్శిస్తే వెంటనే ఉపశమనం లభిస్తుందని ఇక్కడి భక్తులు విశ్వసిస్తుంటారు. శ్రావణ మాసంలో శనీశ్వరుడికి నిర్వహించే ప్రత్యేక పూజలు ... ఉత్సవాల్లో పాలుపంచుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు.

More Bhakti Articles