విజయవాడ

విజయవాడ
కృష్ణా నదీ తీరంలో వెలసిన పుణ్య క్షేత్రాలలో విజయవాడ ఒకటి. పాపాలను కడిగేస్తూ ప్రవహించే కృష్ణా నదినీ ... దర్శనం మాత్రం చేతనే పుణ్య ఫలాలను ప్రసాదించే అమ్మవారిని ఇక్కడ వేరు వేరుగా చూడలేం. పుణ్య క్షేత్రం అనడానికి అవసరమైన పర్వత ప్రదేశం ... నదీ ప్రవాహం ... స్థల మహాత్మ్యం ... దేవతా ఆవిర్భావం ... ఇవన్నీ కూడా విజయవాడ క్షేత్రంలో స్పష్టంగా కనిపిస్తుంటాయి.

ఇక్కడి ఇంద్రకీలాద్రి పర్వతంపై మహిషాసుర మర్ధినిగా దుర్గాదేవి కొలువుదీరి కనిపిస్తుంది. భక్తులు కోరినదే తడవుగా వరాలను ప్రసాదిస్తూ అందరిచే 'అమ్మా' అని పిలిపించుకుంటుంది. 'కీలుడు' అనే భక్తుడు తనపై నివసించవలసిందిగా వరాన్ని కోరుతూ, పర్వత రూపాన్ని సంతరించుకున్నాడు. కృత యుగంలో మహిషాసురుడిని సంహరించిన అనంతరం అమ్మవారు ఇక్కడ వెలిసింది.

ఇక అమ్మవారు 'దుర్గముడు' అనే రాక్షసుడిని సంహరించినందువలన ... దుర్గతులను తరిమికొట్టే శక్తి స్వరూపిణిగా అవతరించినందు వలన 'దుర్గా' అనే పేరు వచ్చిందని అంటారు. ఇక ఈ పర్వత ప్రదేశంలోనే శివుడి కోసం అర్జునుడు తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని సాధించాడు. విజయుడు తపస్సు చేసిన కారణంగా ఈ ప్రాంతాన్ని విజయవాటికగా పిలుచుకునే వారు. కాలక్రమంలో అది విజయవాడగా మార్పు చెందింది.

తొలినాళ్లలో ఇక్కడి అమ్మవారు ఉగ్రమూర్తిగా కనిపించేదట. అది క్షేత్రానికి మంచిది కాదని భావించిన శ్రీ విద్యాశంకరుల వారు, అమ్మవారిని శాంతమూర్తిగా మారుస్తూ శ్రీ చక్ర యంత్రాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి భక్తుల రాక మరింత పెరిగింది. అత్యంత శక్తిమంతమైన ఈ క్షేత్రానికి హనుమంతుడు క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఎప్పుడూ కళ కళ లాడుతూ కనిపించే ఈ తల్లికి భక్తులు చీర .. రవిక ... పసుపు కుంకుమలు ... గాజులు సమర్పిస్తూ వుంటారు.

అమ్మవారికి విశేషంగా కుంకుమార్చనలు జరిపిస్తూ వుంటారు. తలనీలాలు సమర్పించి తమ మొక్కుబడులు చెల్లించుకుంటూ వుంటారు. ప్రతియేటా భవానీ దీక్షలు తీసుకునే వారు, ఇక్కడి అమ్మవారిని దర్శించుకుని దీక్ష విరమిస్తుంటారు. ఇక అంగరంగ వైభవంగా ఇక్కడ జరిగే దసరా నవరాత్రి ఉత్సవాలను చూడాలంటే ఒళ్లంతా కళ్లున్నా సరిపోవనిపిస్తుంది.

ఈ నవరాత్రుల సందర్భంగా అమ్మవారు 'కనక దుర్గ ... బాలా త్రిపుర సుందరి ... లలితా త్రిపుర సుందరి ... గాయత్రి ... అన్నపూర్ణ ... సరస్వతి ... మహాలక్ష్మి ... దుర్గా ... మహిషాసుర మర్ధిని ... రాజరాజేశ్వరి రూపాల్లో భక్తులను అనుగ్రహిస్తూ వుంటుంది.

More Bhakti Articles