బల్లాలేశ్వర్

బల్లాలేశ్వర్
దైవం భక్తులను అనుగ్రహించడం ... వారి పేరుమీద ఆ ప్రదేశంలోనే వెలసి ప్రసిద్ధి చెందడం ప్రాచీనకాలం నుంచి జరుగుతూనే వుంది. అలా బాలుడైన ఓ భక్తుడిని కటాక్షించిన వినాయకుడు, ఆ భక్తుడి కోరిక మేరకు వెలసిన పుణ్య క్షేత్రమే 'బల్లాలేశ్వర గణపతి' క్షేత్రం. ఇది రాయఘడ్ జిల్లాలోని శుద్ధఘడ్ తాలూకా సమీపంలో వెలసింది.

పూర్వం 'పాలీ'గ్రామంలో ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా గల వైశ్య దంపతులు వుండేవారు. వారి సంతానమే బల్లాల్. బాలకుడిన బల్లాల్ తన తోటి పిల్లలతో కలిసి దగ్గరలోని అడవికి వెళ్లి అక్కడ ఆడుతూ వుండగా అతనికి ఓ రాయి కనిపించింది. ఆ రాయి అచ్చు వినాయకుడిని పోలి ఉండటంతో, మిగతా పిల్లలతో కలిసి పూజించడం మొదలు పెట్టాడు.

వినాయకుడి ధ్యాసలో పడి బల్లాలేశ్వర్ ఇంటికి కూడా వెళ్లకపోవడంతో అతణ్ణి వెదుక్కుంటూ వచ్చిన తండ్రి, బల్లాల్ వినాయకుడిగా భావిస్తోన్న రాయిని దూరంగా పారేశాడు. బల్లాల్ ను ఇంటికి తీసుకుపోయి చెట్టుకుకట్టి కొట్టాడు. అప్పుడు వినాయకుడు ఓ బాలుడి రూపంలో వచ్చి బల్లాల్ భరిస్తోన్న నొప్పులను తాను స్వీకరించాడు.

బల్లాల్ కోరిక మేరకు అతని పేరు మీద అక్కడే స్వయంభువుగా వెలిశాడు వినాయకుడు. ఆ తరువాత బల్లాల్ మొదట తనకి కనిపించిన రాయిని తీసుకు వచ్చి, ఆ పక్కనే ప్రతిష్ఠించాడు. ఇక ప్రతి ఉదయం స్వయంభువు విగ్రహంపై సూర్య కిరణాలు పడుతుండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు. ఇక్కడ భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజున ... మాఘ పాడ్యమి రోజున నిర్వహించే ఉత్సవాల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొంటారు.

More Bhakti Articles