బ్రహ్మ క్షేత్రం

సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి ఎక్కడా ఆలయాలు కనిపించవు. అందుకు గల కారణాలంటూ రకరకాల కథలు ప్రచారంలో వున్నాయి. అలాంటి బ్రహ్మ దేవుడు ఇష్టపడిన ప్రదేశం ... గాయత్రీ మాతతో కలిసి యజ్ఞం చేసిన ప్రదేశం ... స్వయంగా వెలసిన క్షేత్రం ... పుష్కర్. అరుదైన ... అపూర్వమైన ఈ క్షేత్రం రాజస్థాన్ - అజ్మీర్ సమీపంలో దర్శనమిస్తుంది.

సముద్ర మట్టానికి దాదాపు 1600 అడుగుల ఎత్తులో 'పుష్కర్' (సరస్సు ) కనిపిస్తుంది. ఈ సరస్సు మహిమాన్విత మైనదిగా ప్రసిద్ధిచెందడం వలన ఈ ప్రాంతానికి కూడా అదే పేరు వచ్చింది. పూర్వం బ్రహ్మ దేవుడు నాలుగు ఎత్తయిన కొండల మధ్యగల ఈ ప్రదేశంలో యజ్ఞం చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంద్రాది దేవతలు వచ్చినా తన అర్ధాంగి సావిత్రి రాకపోవడంతో, అసహనానికి లోనయ్యాడు. ముహూర్తం మించిపోతుండటంతో, తాను వెంటనే వివాహం చేసుకుని ఆ స్త్రీతో యజ్ఞం చేస్తానని ఇంద్రుడితో చెప్పాడు.

దాంతో సమీప గ్రామం నుంచి ఒక యువతిని తీసుకు వచ్చిగోవు చేత ఆమె దేహాన్ని పవిత్రం చేసి పెళ్లి జరిపించాడు ఇంద్రుడు. ఆ దంపతులు యజ్ఞం చేస్తుండగా అక్కడికి వచ్చిన సావిత్రి, బ్రహ్మ మరో స్త్రీతో కలిసి యజ్ఞం చేస్తుండటం చూసింది. జరిగింది తెలుసుకుని పెళ్ళికి కారకుడైన ఇంద్రుడినీ ... అడ్డుచెప్పని కారణంగా శివకేశవులను ... ఆ కార్యం జరిపించిన బ్రాహ్మణులను శపించింది. కోపంతో ఓ కొండపైకెక్కి అక్కడ వెలసింది.

యజ్ఞం పూర్తి చేయాలనుకున్న బ్రహ్మ అందరి శాపాలకు విమోచనాన్ని చెబుతాడు. ఆ తరువాత బ్రహ్మ కూడా ఆ ప్రదేశంలో కొలువుదీరగా ... ఆ పక్కనే గల మరో కొండపై గాయత్రి వెలసింది. వేల సంవత్సరాల చరిత్ర గల ఈ క్షేత్రంలో, 14 వ శతాబ్దానికి చెందిన ఆలయాన్ని ప్రస్తుతం చూడొచ్చు.

ఇక్కడి పుష్కర్లో ఒక్కసారి స్నానం చేయడం వలన జన్మజన్మల పాపం నశిస్తుందని అంటారు. గర్భాలయంలో హంసపై కొలువుదీరిన బ్రహ్మను దర్శించుకున్న భక్తులు, ఆ తరువాత వేరు వేరు కొండలపై గల అమ్మవార్లను కూడా దర్శించుకుంటూ వుంటారు. ప్రతి యేడు కార్తీక పౌర్ణమి రోజున స్వామికి జరిగే ఉత్సవాలకి ... అదే మాసంలో 'పుష్కర్' పేరిట జరిగే జాతరకి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.


More Bhakti News