పాపాలను కడిగేసే కపిలతీర్థం

పాపాలను కడిగేసే కపిలతీర్థం
కపిలతీర్థం ... ఈ పేరు వినగానే తిరుమల గుర్తుకు వస్తుంది ... తిరుమల కొండలపై నుంచి దూకే జలపాతం గుర్తుకు వస్తుంది. సాధారణంగా యాత్రలకి వెళ్ళిన వాళ్లు అక్కడి కోనేరులోనో ... జలపాతాల్లోనో స్నానమాచరించడాన్ని పుణ్యప్రదంగా భావిస్తుంటారు. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ నిలువునా పాపాలను కడిగేసే పుణ్య తీర్థం ... కపిల తీర్థం. తిరుమల కొండలకు ఆనుకుని ఉన్న 'అలిపిరి' దిగువకు వెళ్తే 'కపిలతీర్థం' కనిపిస్తుంది. కృతయుగంలో 'కపిల మహర్షి' శివుడి కోసం ఇక్కడ తపస్సు చేశాడు. అప్పుడు శివుడు భూమిని చీల్చుకుంటూ ఇక్కడ వెలిశాడని స్థలపురాణం చెబుతోంది. ఈ కారణంగానే ఇక్కడి శివయ్యని 'కపిలేశ్వరుడు'అని అంటారు. తిరుమల కొండలపై నుంచి ఈ క్షేత్రంలోని పుష్కరిణి లోకి దూకుతూ వచ్చే జలధారలనే 'కపిలతీర్థం' అని అంటారు.

11 వ శతాబ్దానికి చెందిన రాజేంద్ర చోళుడు శివ భక్తుడు కావడంతో ఆయన కాలంలో ఇక్కడి స్వామి వారికి ఆలయ నిర్మాణం జరిగిందని తెలుస్తోంది. ఆ తరువాత అచ్యుత రాయలు విష్ణు భక్తుడు కావడంతో ఆయన కాలంలో ఈ తీర్థానికి ఆళ్వారు తీర్థమని ప్రచారం కల్పించాడు. ఇక ఇప్పటికీ కూడా దీనికి 'చక్ర తీర్థం' అనే పేరు కూడా వాడుకలో వుంది. ఇక ఈ క్షేత్రంలో కపిలేశ్వరుడితో పాటు కాశీ విశ్వేశ్వరుడు ... సహస్ర లింగేశ్వరుడు ... లక్ష్మీ నారాయణుడు ... శ్రీ కృష్ణాలయం ... ఆగస్తేశ్వర ఆలయం ... సుబ్రహ్మన్యేశ్వర ఆలయం కనిపిస్తాయి.

కపిలతీర్థం పవిత్రత గురించి పురాణాల్లో ప్రస్తావన కనిపిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున మధ్యాహ్న సమయంలో సకల పుణ్య తీర్థాలు కపిలతీర్థంలో కలుస్తాయని అంటారు. ఆ సమయలో ఈ తీర్థంలో స్నానాలు చేయడానికి భక్తులు వేలసంఖ్యలో వస్తుంటారు. పరమ పవిత్రమైన ఈ పుణ్యతీర్థంలో ప్రతియేడు మాఘమాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు పది రోజులపాటు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి. శివకేశవులు కొలువుదీరిన కపిలతీర్థంలో స్నానమాచరించడం వలన శరీరంతో పాటు మనసు పవిత్రమవుతుంది ... మనసారా కోరుకున్న వారికి అది మోక్షాన్ని ప్రసాదిస్తుంది.

More Bhakti Articles