బ్రహ్మంగారి మఠం

బ్రహ్మంగారి మఠం
సాధారణ మానవుడిలా వివిధ ప్రాంతాలను దర్శిస్తూ, అక్కడి ప్రజలకు అర్ధమయ్యే వాడుక భాషలో భక్తి విశ్వాసాలను ప్రచారం చేసిన మహనీయుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయనలో ఒక తత్త్వవేత్త ... సంఘ సంస్కర్త ... మానవతావాది కనిపిస్తారు. ఆయన రాసిన 'కాలజ్ఞానం' అప్పటికీ ఇప్పటికీ ఒక అద్భుతంగానే మిగిలిపోయింది. కాలజ్ఞానంలో ఆయన పేర్కొన్న సంఘటనలు ఒక్కొక్కటిగా జరుగుతూ వస్తుండటంతో, ఆయనని పూజించే భక్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.

ఈ నేపథ్యంలో కొందరు ఆయనను విష్ణు స్వరూపంగా భావిస్తే ... మరికొందరు శివ రూపంగా భావించి ఆరాధిస్తున్నారు. ముఖ్యంగా 'బనగాన పల్లె' ... 'కందిమల్లాయ పల్లె' ప్రదేశాలు ఆయన మహిమలకు వేదికలుగా నిలిచాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాయడానికి అవసరమైన తాటి ఆకుల కోసం తాటి చెట్టు దానంతట అదే తల వంచిన ప్రదేశం ... గిరి గీసి పశువులను మేపిన ప్రదేశం ... ఆయన కాలజ్ఞానం రాయబడిన 'రవ్వలకొండ' గుహ ... రాసిన తాళ పత్రాలను భద్రపరిచిన ప్రదేశం ... అచ్చమ్మకి మంత్రోపదేశం చేసిన 'ముచ్చట్ల కొండ' నేటికీ యాత్రా స్థలాలుగా వెలుగొందుతున్నాయి.

రానున్న కాలంలో జరగనున్న సంఘటనలను కళ్లకు కట్టినట్టుగా చెప్పిన బ్రహ్మం గారు, కడప జిల్లా కందిమల్లాయ పల్లిలో జీవసమాధి చెందారు. కాలక్రమంలో ఇక్కడ ఆయన మఠం వెలసింది. ఆ దివ్య పురుషుడు తిరుగాడిన ప్రదేశాన్ని ... ఆయన ఉపయోగించిన వస్తువులను ... ఆయన సమాధిని దర్శించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. సమాధి నుంచే ఆయన తన భక్తులను కాపాడుతూ వుంటారనే విషయాన్ని వాళ్లు ఎంతగానో విశ్వసిస్తూ వుంటారు.

More Bhakti Articles