సూర్యనార్ కోవిల్

సూర్యనార్ కోవిల్
ప్రసిద్ధి చెందినటువంటి సూర్య దేవాలయాల్లో తమిళనాడు - కుంబకోణం సమీపంలోని 'తిరుమంగళుక్కుడి'లో వెలసిన 'సూర్యనార్ కోవిల్'ఒకటి. 11వ శతాబ్దంలో చోళ ప్రభువైన మొదటి కుళుత్తోంగ చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా చారిత్రక ఆధారాలు వున్నాయి. అంతకు ముందుగానే శివపార్వతులు ఆవిర్భవించిన ఈ క్షేత్రంలో, ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణమూర్తి తన భార్యలైనటువంటి ఉష - ఛాయ సమేతంగా దర్శనమిస్తాడు. నాటి నుంచి నేటి వరకూ ఇక్కడి స్వామివారిని తామర పువ్వులతో పూజిస్తూ వుండటం ఆచారంగా వస్తోంది.

ఇక్కడి స్థలపురాణాన్ని పరిశీలిస్తే ... పూర్వం 'కళవ మహాముని' తనకి త్వరలో కుష్టువ్యాధి రానుందని తెలుసుకుని, అది రాకుండా కాపాడమని నవగ్రహాలను వేడుకున్నాడట. అందుకు అంగీకరించిన నవగ్రహాలపై బ్రహ్మదేవుడు ఆగ్రహావేశాలను వ్యక్తం చేశాడు. ఆయన శాప ఫలితంగా నవగ్రహాలకు కూడా కుష్టువ్యాధి సోకింది. శాపవిమోచనం చెప్పమని వారు వేడుకోగా ... 'తిరుమంగళక్కుడి'లోని విశాలాక్షీ సమేత విశ్వేశ్వరుడిని ... గణపతి సహితంగా అర్చించమని చెప్పాడు. దాంతో నవగ్రహాలు ఈ ప్రదేశానికి వచ్చి గణపతిని ప్రతిష్ఠించడమే కాకుండా ఆదిదంపతులను సేవించారు. ఫలితంగా అందరికీ శాపవిమోచనం జరిగింది.

తన కారణంగా నవగ్రహాలు ఇబ్బందుల్లో పడినందుకు కృతజ్ఞతగా,వాళ్లంతా తపస్సు ఆచరించిన ఆ ప్రదేశంలోనే కళవ మహాముని ఓ దేవాలయాన్ని నిర్మించాడు ... అదే నేటి 'సూర్యనార్ కోవిల్'. ప్రదక్షిణ క్రమంలో ఇక్కడి దైవాలను దర్శిస్తూ వెళ్లాలి. వివిధ గ్రహ దోషాలతో ఇబ్బందులు పడుతున్నవారు ఇక్కడి అధిక సంఖ్యలో వచ్చి గ్రహశాంతులు చేయిస్తుంటారు. ఇటు పార్వతీ పరమేశ్వరులు ... అటు నవగ్రహాల అనుగ్రహం కోరేవారు ఈ క్షేత్రాన్ని దర్శించి ధన్యులు అవుతుంటారు.

More Bhakti Articles