కన్యాకుమారి

కన్యాకుమారి
సముద్ర గర్భంలో నుంచి ఉదయిస్తున్న సూర్యుడిని ... ఆ తరువాత అస్తమిస్తోన్న సూర్యుడిని చూడగలిగే ఏకైక ప్రదేశమే 'కన్యా కుమారి'. ఇక ఈ రెండు దృశ్యాలే కాదు ... ఇక్కడ వెలసిన 'కన్యాకుమారి' ముక్కుపుల్ల కూడా మూడో అద్భుతంగా అనిపిస్తుంటుంది. ఈ మూడింటిని చూడటానికి దేశం నలుమూలల నుంచి యాత్రికులు ఇక్కడికి వస్తుంటారు.

తూర్పున బంగాళా ఖాతం ... దక్షిణాన హిందూ మహా సముద్రం ... పడమటన అరేబియా సముద్రం సంగమించే ఈ క్షేత్రం ఎంతో విశిష్ట మైనదిగా చెప్పబడుతోంది. మనసుకి ఆహ్లాదాన్ని కలిగించేలా ప్రకృతి ఒడిలో వెలసిన ఈ క్షేత్రం, మళ్లీ మళ్లీ రావాలనిపించేలా మధురానుభూతిని కలిగిస్తుంది. ఇక్కడ కన్యాకుమారి కొలువుదీరి ఉండటానికి గల కారణం మనకి పురాణాలలో కనిపిస్తుంది.

పూర్వం బాణాసురుడు అనే రాక్షసుడు సాధుజనుల పాలిట సమస్యగా తయారయ్యాడు. 'కన్య' చేతిలో మాత్రమే అతనికి మరణం రాసిపెట్టి వుందని తెలుసుకున్న అమ్మవారు, కన్యగా అవతరించింది. ఆ సమయంలోనే ఆమె శంకరుడి పట్ల ఆకర్షితురాలైంది. అయితే ఆమె కన్యగా వుండటం వల్లనే బాణాసురుడు అంతమవుతాడని గ్రహించిన నారదుడు, శంకరుడికి ఆమె చేరువ కాకుండా అడ్డుకుంటాడు. దాంతో మనసు నొచ్చుకున్న కన్య ... రాక్షస సంహారం అనంతరం ఈ ప్రదేశంలో తపస్సు చేస్తూ ఉండిపోయింది. ఈ కారణంగానే ఈ క్షేత్రానికి 'కన్యాకుమారి' అనే పేరు వచ్చింది.

ఇక్కడి అమ్మవారిని పరశురాముడు ప్రతిష్ఠించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. కన్యాకుమారి అనురాగపూరితమైన దృష్టితో పాటు, వజ్రంతో చేయబడిన ఆమె పుక్కుపుల్ల ఓ అద్భుతమనే చెప్పాలి. ఇక్కడి సాగర సంగమంలో స్నానం చేయడాన్ని భక్తులు పుణ్యప్రదంగా భావిస్తుంటారు. అలాగే కన్యాకుమారి దర్శనంతో కష్టాలు తీరతాయని విశ్వసిస్తుంటారు.

More Bhakti Articles