దక్షిణా దేవి

దక్షిణా దేవి
ఒక గోపిక ... సాక్షాత్తు లక్ష్మీదేవి అంశగా మారిపోవడం అనేది మనకి 'దక్షిణా దేవి' విషయంలో కనిపిస్తుంది. నిజానికి దక్షిణా దేవి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అలా తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆమె జీవితం ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. రాధా కృష్ణుల ప్రేమ తత్త్వాన్ని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. వాళ్లు ప్రేమ ప్రపంచంలో ... ప్రణయ తీరాల్లో విహరిస్తూ వున్న రోజుల్లో 'సుశీల' అనే గోపిక రాధకి ప్రధాన సహచరిగా వుండేది.

ఒకసారి ఆమె శ్రీ కృష్ణుడితో మాట్లాడుతూ ఊహించని విధంగా ఆయన తొడపై కూర్చుంది. దూరం నుంచి ఈ దృశ్యాన్ని చూసిన రాధ ... పరిగెత్తుకు రాసాగింది. అది చూసిన సుశీల అక్కడి నుంచి పారిపోయింది. తిరిగి ఆమె గోకులంలో ప్రవేశిస్తే ప్రాణాలు కోల్పోతుందని రాధ శాపం పెట్టింది. దాంతో గోకులానికి దూరంగా ఓ నిర్జన ప్రదేశంలో తపస్సు చేసిన సుశీల ... లక్ష్మీ దేవి శరీరంలోనే ఒక భాగమైపోయింది. దాంతో శ్రీ మహా విష్ణువు ఆమెను బ్రహ్మదేవుడికి అప్పగించాడు. ఆయన ఆమెకి 'దక్షిణ'అనే పేరుపెట్టి 'యజ్ఞుడు' తో వివాహం జరిపించాడు.

ఆ రోజు నుంచి ఆమె ఇటు దైవ కార్యాలలోను ... అటు శుభ కార్యాలలోను దక్షిణ ఇవ్వని వారికి ఫలితం అందకుండా చేసే బాధ్యతను స్వీకరించడం మొదలుపెట్టింది. అలాంటి దక్షిణా దేవిని పూజించిన వారికి వ్యాధుల బారి నుంచి ... బాధల బారి నుంచి విముక్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

More Bhakti Articles