కాశీలో ఉత్తరార్క సూర్యుడి ప్రత్యేకత

కాశీ క్షేత్రం అనేక ఆలయాల సమాహారంగా కనిపిస్తుంది .. అనేక విశేషాలను తనలో దాచుకుని దర్శనమిస్తూ ఉంటుంది. అడుగుపెట్టినంత మాత్రాన్నే మోక్షాన్ని ప్రసాదించే కాశీలో, 12 వరకూ సూర్య దేవాలయాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కో ఆలయం వెనుక ఒక్కో ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది. ఒక్కో ఆలయంలోని సూర్య భగవానుడు ఒక్కో పేరుతో పిలబడుతుంటాడు. వారిలో ఒకరిగా ఉత్తరార్క సూర్యుడు కనిపిస్తుంటాడు.

పూర్వం రాక్షసుల ధాటిని తట్టుకోలేకపోయిన దేవతలు, వారిని జయించే మార్గం చెప్పమని సూర్యభగవానుడిని ఆశ్రయిస్తారు. వారికి ఒక పర్వత శిలను ఇచ్చిన సూర్యభగవానుడు, ఆ శిలను కాశీ క్షేత్రానికి వెళ్లి తన రూపాన్ని చెక్కమని చెబుతాడు. ఆ సమయంలో రాలిపడే రాతి ముక్కలను ఆయుధాలుగా రాక్షసులపై ఉపయోగించమని అంటాడు. ఆ స్వామి సెలవిచ్చినట్టుగానే రాక్షసులపై దేవతలు విజయాన్ని సాధిస్తారు. 'ఉత్తరం' అంటే చెప్పడం .. దేవతలకి తరుణోపాయం చెప్పడం వల్లనే ఇక్కడి సూర్యభగవానుడికి ఉత్తరార్కుడు అని పేరు వచ్చిందని చెబుతారు.


More Bhakti News