దారిద్ర్యాన్ని నివారించే మయూఖాదిత్యుడు

కాశీ క్షేత్రంలో చూడదగిన ప్రదేశాలలో మయూఖాదిత్యుడి ఆలయం ఒకటిగా కనిపిస్తుంది. పంచగంగ రేవు సమీపంలో ఈ స్వామి దర్శనమిస్తుంటాడు. పూర్వం ఇక్కడ శివలింగాన్ని .. మంగళగౌరిదేవిని ప్రతిష్ఠించి సూర్యభగవానుడు పూజించాడట. ఆయన తపస్సుకు మెచ్చిన పరమశివుడు అమ్మవారితో పాటు ప్రత్యక్షమై, 'మయూఖాదిత్యుడు' అనే వరాన్ని ప్రసాదించాడట.

శివుడిని పూజిస్తూ సూర్యభగవానుడు కాశీ క్షేత్రంలోనే ఉండిపోయినప్పుడు, ఆయన మయూఖాలు (కిరణాలు) మాత్రమే లోకంలో వెలుగులు విరజిమ్మాయట. అందువలన పరమశివుడు ఆయనకి ఆ వరాన్ని ఇచ్చాడట. మయూఖాదిత్యుడిని దర్శించుకున్నవారిని దారిద్య్రం దరిచేరదని సెలవిచ్చాడు. చైత్ర శుద్ధ తదియనాడు తననీ .. మంగళగౌరీ దేవిని ఆరాధించినవారికి సకల శుభాలు కలుగుతాయని చెప్పాడట. అందువలన కాశీ క్షేత్రానికి వెళ్లినవారు, మయూఖాదిత్యుడిని దర్శించుకోవడం మరిచిపోవద్దు.  


More Bhakti News