వేంకటేశ్వరస్వామి వైభవమే బ్రహ్మోత్సవం

తిరుమలలో జరిగే 'బ్రహ్మోత్సవాలు' తిలకించడం తమ పూర్వజన్మ సుకృతమని భక్తులు భావిస్తుంటారు. అందువలన ఆ ఉత్సవాలను తిలకించడానికి పోటెత్తుతుంటారు. దేవీ నవరాత్రుల సమయంలో .. అంటే 'ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి' నుంచి బ్రహ్మోత్సవాలు మొదలై నవమితో ముగుస్తుంటాయి. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారు 'పెద్దశేష వాహనం .. 'చిన్నశేష వాహనం' .. 'హంస వాహనం' .. 'సింహ వాహనం' .. 'ముత్యాలపందిరి వాహనం' .. 'కల్పవృక్ష వాహనం' .. 'సర్వభూపాల వాహనం' .. 'గరుడ వాహనం' .. 'హనుమద్వాహనం'.. 'గజ వాహనం' .. 'సూర్యప్రభ వాహనం' .. 'చంద్రప్రభ వాహనం'పై ఊరేగుతూ భక్తులకు నయనానందాన్ని కలిగిస్తాడు.

ఇక తిరుమలలో జరిగే 'రథోత్సవం' చూడటానికి రెండు కళ్లు సరిపోవు. రథంపై ఊరేగే స్వామివారిని దర్శించుకోవడం వలన పునర్జన్మ ఉండదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ రోజు రాత్రి స్వామివారిని 'అశ్వ వాహనం'పై ఊరేగిస్తారు. తొమ్మిదో రోజున జరిగే 'చక్ర స్నానం' ఎంతో విశేషమైనది. ఈ ఉత్సవంలో పాల్గొనడం వలన .. దర్శించడం వలన సమస్త దోషాలు తొలగిపోయి, సకల శుభాలు చేకూరతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.    


More Bhakti News