వీధి వీధిలో బతుకమ్మ సందడి

తెలంగాణలో స్త్రీలు జరుపుకునే పెద్ద పండుగగా 'బతుకమ్మ' కనిపిస్తుంది. భాద్రపద బహుళ అమావాస్య నుంచి ఆశ్వయుజ శుద్ధ దశమి వరకూ తెలంగాణలోని గ్రామీణ ప్రాంతపు వీధుల్లో బతుకమ్మ పాటలు .. ఆటలు కనిపిస్తాయి .. కనువిందు చేస్తాయి. బతుకమ్మ పండుగ రోజుల్లో ఆడపిల్లలు పొద్దునే నిద్రలేచి .. స్నేహితులతో కలిసి వివిధ రకాల పూలను సేకరించడం మొదలుపెడతారు. తంగేడు పూలు చాలా ముఖ్యమైనవి కనుక, పొలిమేరల్లోకి వెళ్లి మరీ తీసుకొస్తారు.

ఒకరిని మించి ఒకరు బతుకమ్మలను అందంగా పేరుస్తారు. అందరి బతుకమ్మలను ఒక చోట ఉంచి వాటి చుట్టూ గుండ్రంగా తిరుగుతూ, లయ బద్ధంగా చప్పట్లు కొడుతూ పాటలు పాడతారు. 'గౌరి కల్యాణం' .. 'శ్రీమహాలక్ష్మీ కథలు' ఈ పాటల్లో ఎక్కువగా చోటుచేసుకుంటూ ఉంటాయి. తెలంగాణ జానపద సాహిత్యంలోని వైభవం బతుకమ్మ పాటల్లో కనిపిస్తుంది. పురాణాలు .. ఇతిహాసాల పట్ల వాళ్లకి గల అవగాహనకి అద్దం పడుతుంది. తెలంగాణ ఆడపడుచుల మధ్యగల సఖ్యతను ప్రతిబింబించే ఈ పండుగ, అమావాస్యనాడు 'ఎంగిలిపూవు'తో మొదలవుతుంది. అష్టమి రోజు సద్దుల బతుకమ్మను చేసి .. చివరి రోజున 'పోయిరావమ్మా బంగారు బతుకమ్మ' అంటూ జలాశయాల్లో వదిలి గౌరమ్మను సాగనంపుతారు.


More Bhakti News