అదే కాణిపాకం వినాయకుడి ప్రత్యేకత

వినాయకుడు స్వయంభువు మూర్తిగా ఆవిర్భవించిన అత్యంత మహిమాన్వితమైన క్షేత్రాలలో, చిత్తూరు జిల్లాలోని 'కాణిపాకం' ఒకటి. ఇక్కడి గణపతిని వరసిద్ధి వినాయకుడిగా భక్తులు పూజిస్తున్నారు. పొలంలోని ఓ వ్యవసాయ బావి పూడికను తీస్తుండగా వరసిద్ధి వినాయకస్వామి స్వయంభువు మూర్తిగా వెలుగు చూసింది. అప్పటి నుంచి ఇక్కడి స్వామివారికి పూజాభిషేకాలు నిర్వహిస్తున్నారు. బావిలో ఆవిర్భవించిన స్వామివారి మూర్తి పెరుగుతూ వుండటం ఇక్కడి విశేషం. చాలా సంవత్సరాలుగా స్వామివారికి అమర్చుతూ వస్తోన్న కవచాలు ఆ తరువాత సరిపోకపోవడమే అందుకు నిదర్శనం.

ఈ క్షేత్రం సత్య ప్రమాణాలకు ప్రసిద్ధి చెందినదిగా చెబుతారు. ఎవరు ఎలాంటి మోసాలకు పాల్పడినా .. అన్యాయాలు .. అక్రమాలు చేసినా, అవతలవాళ్లు ఇక్కడ ప్రమాణాలు చేయిస్తుంటారు. ప్రమాణాలు చేసేవాళ్లు సాధారణంగా ఈ స్వామివారి సన్నిధిలో అసత్యమాడరనీ .. అలా అసత్యమాడినవాళ్లు శిక్షించబడటం జరుగుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు. ప్రమాణం చేసిన తరువాత మంచి మార్గంలో జీవితాన్ని కొనసాగిస్తున్న వాళ్లు వున్నారని అంటారు. 'వినాయక చవితి' రోజు నుంచి ఇక్కడ 21 రోజులపాటు బ్రహ్మోత్సవాలు .. ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవాలలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు.       


More Bhakti News