కృష్ణా అంటే కష్టములు వుండవు

శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ప్రతి గ్రామంలోను కృష్ణుడిని పూజిస్తూ వుంటారు. పూజా మందిరంలోని ఆ స్వామి మూర్తిని ఆరాధించి, ఆయనకి ఇష్టమైన పాలు .. మీగడ .. వెన్న నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఈ రోజున ఆ స్వామి ఆలయాలకు వెళ్లి భజనలో పాల్గొంటూ వుంటారు .. ఆయన బాల్యక్రీడలను తలచుకుంటూ అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతుంటారు. ధర్మ సంస్థాపన కోసమే అవతరించిన శ్రీకృష్ణుడు, ధేనుకాసురుడు .. ప్రలంబాసురుడు .. వృషభాసురులను సంహరించాడు. 'కేశి' అనే అసురుడిని .. కంసుడిని అంతం చేశాడు. అహంభావంతో తననే సవాలు చేసిన పాండ్రక వాసుదేవుడికి సరైన సమాధానమిచ్చాడు.

'కుబ్జా' అనే త్రివక్ర వంకరలు సరిచేసి ఆమెకి అందమైన రూపాన్ని ఇచ్చాడు. ధర్మాన్ని అంటిపెట్టుకుని .. తనని ఆశ్రయించిన పాండవులకు అడుగడుగునా అండగా నిలిచాడు. కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల వైపు నిలబడి వాళ్లకి విజయం చేకూరేలా చేశాడు .. ఈ లోకానికి 'గీత'ను అందించాడు. పేదరికంతో బాధపడుతోన్న చిన్ననాటి స్నేహితుడైన సుధాముడికి సిరిసంపదలను అనుగ్రహించాడు. నిజమైన స్నేహితుడు ఎలా ఉండాలనే విషయాన్ని ఈ లోకానికి చాటి చెప్పాడు. 'గోవర్ధన గిరి'ని పైకెత్తి అక్కడి ప్రజలకు రక్షణ కల్పించాడు. అలాంటి కృష్ణుడిని నామాన్ని స్మరించడం వలన .. ఆయన క్షేత్రాలను దర్శించడం వలన సమస్త పాపాలు నశించి, సకల శుభాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.   


More Bhakti News