ఇక్కడి నరసింహస్వామికి కొండికాసులవాడు అని పేరు

శ్రీమహావిష్ణువు .. ప్రహ్లాదుడిని రక్షించడం కోసం, హిరణ్యకశిపుడిని సంహరించడం కోసం నరసింహస్వామి అవతారాన్ని ధరించాడు. అలా నరసింహస్వామి అవతారాన్నెత్తిన స్వామి, అనేక క్షేత్రాలలో ఆవిర్భవించారు. అలాంటి పరమపవిత్రమైన .. శక్తిమంతమైన క్షేత్రాలలో 'పెంచలకోన' ఒకటిగా కనిపిస్తుంది. ఇక్కడి స్వామివారిని భక్తులు 'కొండికాసులవాడు' అని పిలుచుకుంటూ వుంటారు .. కొలుచుకుంటూ వుంటారు. ఇలా స్వామిని పిలుచుకోవడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది.

పూర్వం ఇక్కడి అడవీ ప్రాంతంలో స్వామి సంచరిస్తూ ఉండగా, చెంచులక్ష్మి తారసపడుతుంది. ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న స్వామి, ఆ విషయాన్ని చెంచు పెద్దల దృష్టికి తీసుకెళతాడు. దాంతో వాళ్లు కన్యాశుల్కం ద్వారా కోటి బంగారు కాసులు చెల్లించమని కోరతారు. తనకి భక్తులు చెల్లించే మొక్కుల ద్వారా ఆ మొత్తం చెల్లిస్తానని చెప్పి, చెంచులక్ష్మిని స్వామివారు పెళ్లి చేసుకున్నారట. అందువల్లనే ఇక్కడి స్వామిని 'కొండికాసులవాడు' అని పిలుచుకుంటూ వుంటారు. మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వలన దుష్ట శక్తుల బారి నుంచి .. గ్రహ సంబంధమైన బాధల నుంచి విముక్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తూ వుంటారు.    


More Bhakti News