తిరువారూరు

సాధారణంగా పుణ్య క్షేత్రాలు నదీ తీరంలో వెలుస్తుంటాయి. లేదంటే ఆలయ సమీపంలో పెద్ద బావిని కానీ ... కోనేరును గాని తవ్విస్తుంటారు. అయితే ఒక దేవాలయం ఎంత విస్తీర్ణంలో వుందో ... అంతే విస్తీర్ణంలో కోనేరు వుండటం కాస్త ఆశ్చర్యం కలిగించక మానదు. ఇలాంటి అనుభవం మనకి 'తిరువారూరు'క్షేత్రంలో ఎదురవుతుంది. ఇక్కడి దేవాలయం 30 ఎకరాల్లోను ... కోనేరు కూడా అదే విస్తీర్ణంలోను కనిపిస్తాయి. దక్షిణ భారత దేశంలోనే అతి పెద్ద కోనేరుగా ఘనతకెక్కిన దీని పేరు 'కమలాలయం'.

తమిళనాడు - తంజావూరు జిల్లాలో వెలసిన ఈ క్షేత్రం ఎంతో స్థల ప్రాశస్త్యాన్ని ... మరెంతో చారిత్రక నేపథ్యాన్ని కలిగివుంది. క్రీ.శ.7 నుంచి 10 వ శతాబ్దం మధ్య కాలంలో ఇక్కడి స్వామివారికి చోళ రాజులు ఆలయాన్ని నిర్మించినట్టు స్థల పురాణం చెబుతోంది. ఇక్కడి గర్భాలయంలో నెలకొని వున్న 'మరకత లింగం' అచలేశ్వరుడిగా పిలవబడుతోంది. ప్రాచీనతలోను ... ప్రాకారాల విషయంలోనూ ... నలు దిక్కులా చుక్కలనంటే రాజగోపురాలతోను ఈ క్షేత్రం ఘన చరిత్రకు ఆనవాలుగా కనిపిస్తుంటుంది.

ఇక్కడి చోళరాజు ధర్మాత్ముడనీ ... ధర్మం కోసం తన ఒక్కగానొక్క కొడుక్కి మరణ దండన విధించగా, సాక్షాత్తు ఆ శివయ్యే అతని కుమారుడిని బతికించాడని చరిత్ర చెబుతోంది. ఇక ఇక్కడ జరిగే 'రథోత్సవం' ... 'కోనేరులో నిర్వహించే 'తెప్పోత్సవం' చూడటానికి వేల కళ్ళు కావాలి ... అనిర్వచనీయమైన ఆ అనుభూతిని పొందడానికి మరెన్నో మనసులు కావాలి.


More Bhakti News