కుమారస్వామి ప్రతిష్ఠించిన శివలింగం

తూర్పు గోదావరి జిల్లాలోని పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో 'సామర్లకోట' ఒకటిగా కనిపిస్తుంది. పంచారామాలలో ఒకటైన 'కుమారారామం' ఇక్కడ దర్శనమిస్తుంది. కుమారస్వామి .. తారకాసురుడిని సంహరిస్తోన్న సమయంలో, తారకాసురుడి మెడలోని 'ఆత్మలింగం' అయిదు ముక్కలైపోయి .. అవి అయిదు ప్రదేశాల్లో పడతాయి. అవే పంచారామాలుగా ప్రసిద్ధి చెందాయి. అలా సామర్లకోటలో పడిన ఒక ఆత్మలింగ భాగాన్ని కుమారస్వామి ప్రతిష్ఠించాడు. అందువల్లనే ఈ క్షేత్రానికి 'కుమారారామం' అనే పేరు వచ్చింది.

ఈ క్షేత్రంలోని శివలింగం .. స్థంభం మాదిరిగా 16 అడుగుల పొడుగుతో కనిపిస్తుంది. ఈ కారణంగానే స్వామివారి ముఖభాగం రెండవ అంతస్థులో కనిపిస్తుంది. భక్తులు మూల భాగానికి నమస్కరించుకుని మెట్ల ద్వారా పైకి చేరుకోవాలి. ఇక్కడి అమ్మవారు 'బాలా త్రిపుర సుందరి'గా పూజలు అందుకుంటూ ఉంటుంది. చాళుక్య భీముడు అనే రాజు ఈ  ఆలయాన్ని నిర్మించడం వలన, స్వామివారు భీమేశ్వరుడుగా పిలవబడుతున్నాడు. ఆలయ ప్రాకారాలు .. ప్రాకార మంటపాలు .. ఆలయానికి ఒక వైపున ఎర్ర తామరలతో కూడిన కోనేరును చూసి తీరవలసిందే. ఈ ఆలయ దర్శనమాత్రం చేతనే సమస్త దోషాలు .. పాపాలు నశిస్తాయనేది మహర్షుల మాట.    


More Bhakti News