అదే ర్యాలి క్షేత్రం ప్రత్యేకత

తూర్పుగోదావరి జిల్లాలోని పరమపవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో 'ర్యాలి' ఒకటిగా కనిపిస్తుంది. రావులపాలెం సమీపంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. ఇక్కడ శివకేశవులు స్వయంభువులు కావడం విశేషం. శివకేశవులు ఇక్కడ ఆవిర్భవించడానికి వెనుక, శ్రీమహావిష్ణువు .. జగన్మోహినీ రూపంలో దేవతలకి అమృతాన్ని పంచడమనే పురాణ కథ ఉండటం మరో విశేషం. జగన్మోహిని సౌందర్యానికి ముగ్ధుడై ఆమెను అనుసరిస్తూ శివుడు రావడం .. జగన్మోహిని రూపంలో వున్న విష్ణుమూర్తి వెనుదిరిగి తన నిజరూపాన్ని చూపించిన ప్రదేశం ఇది.

అలా ఈ క్షేత్రంలో విష్ణుమూర్తి .. శివుడు కూతవేటు దూరంలో ఒకరి ఎదురుగా ఒకరు ఆవిర్భవించారు. ఇక్కడి విష్ణుమూర్తి పాదాల మధ్య భాగంలో గంగ  ఊరుతూ ఉంటుంది. అందువలన ఆ ప్రదేశమంతా చెమ్మగా ఉంటుంది. ఇక పరమశివుడు 'రుద్రాక్ష'ను పోలిన లింగరూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. స్వామివారికి ఎంతనీటితో అభిషేకం చేసినా ఆ నీళ్లు పానవట్టం దాటి బయటికి రావు. ఆ నీళ్లు ఏమైపోతున్నది ఎవరికీ తెలియదు. విష్ణుమూర్తి పాదాల నుంచి నిరంతరం గంగ ఊరుతుండటం .. శివుడు తలపై పోసిన నీళ్లు బయటికి రాకపోవడమే ఈ క్షేత్రం ప్రత్యేకత .. విశిష్టత .. మహిమ అని చెప్పొచ్చు.         


More Bhakti News