అలా వినాయకుడు ఏకదంతుడయ్యాడు

ఒకసారి పార్వతీ పరమేశ్వరుల దర్శనం కోసం పరశురాముడు కైలాసానికి చేరుకుంటాడు. ఆయన నేరుగా లోపలికి వెళ్లబోతుండగా అక్కడే వున్న వినాయకుడు అడ్డుకుంటాడు. తన తల్లితండ్రుల అనుమతి తీసుకుని వచ్చి లోపలికి పంపిస్తానని అంటాడు. వినాయకుడి ధోరణి పరశురాముడికి ఆగ్రహాన్ని కలిగిస్తుంది. పార్వతీ పరమేశ్వరులకు తాను కూడా పుత్ర సమానుడనేననీ .. తన తల్లిదండ్రుల దర్శననానికి అనుమతి అవసరం లేదని పరశురాముడు లోపలికి వెళ్లబోతాడు.

 ఎంతగా వారించినా వినిపించుకోకపోవడంతో, తన తొండంతో పరశురాముడిని గట్టిగా చుట్టేసి గిరగిరా తిప్పడం మొదలుపెడతాడు. అలా పరశురాముడిని సప్త సముద్రాల్లో ముంచేసి మళ్లీ కైలాసానికి తీసుకొస్తాడు. ఆ వేగానికి తట్టుకోలేకపోయిన పరశురాముడు తిరిగి నిలదొక్కుకోవడానికి కొంత సమయం తీసుకుంటాడు. ఆ తరవాత ఆగ్రహంతో తన చేతిలోని గొడ్డలిని వినాయకుడిపైకి విసురుతాడు. దాంతో వినాయకుడి దంతం విరిగిపోతుంది. అంతలో పార్వతీ పరమేశ్వరులు బయటికి వస్తారు .. అదే సమయంలో విష్ణుమూర్తి కూడా అక్కడికి వస్తాడు. వినాయకుడు గాయపడటం చూసి పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. బాధపడొద్దనీ .. ఇక నుంచి వినాయకుడు 'ఏక దంతుడు' అనే పేరుతో పిలవబడతాడని విష్ణుమూర్తి సెలవిస్తాడు.        

More Bhakti Articles