నారదుడు విష్ణుమాయకి లోనైంది .. బయటపడింది ఇక్కడే!

నారద మహర్షి గురించి తెలియనివారంటూ వుండరు. లోక కల్యాణం కోసం నారద మహర్షి ఎన్నో లీలావిశేషాలను చూపించాడు. అంతేకాదు భూలోకంలో ఆయన జనార్ధనస్వామి మూర్తులను ప్రతిష్ఠించినట్టుగా కూడా ఆయా స్థల పురాణాలను బట్టి తెలుస్తోంది. సాక్షాత్తు నారద  మహర్షి తపస్సు చేసుకున్నట్టుగా .. వివాహం కూడా చేసుకుని సంతానాన్ని కూడా పొందిన కథలేవీ మనకి ఏ క్షేత్రంలోను వినిపించవు. కానీ తూర్పు గోదావరి జిల్లా .. కాకినాడకి సమీపంలోగల 'సర్పవరం'లో ఈ విషయాలన్నీ అక్కడి స్థలపురాణంగా మనకి వినిపిస్తాయి.

ఇక్కడి సరస్సులో స్నానం చేసిన నారదుడు .. విష్ణు మాయ కారణంగా స్త్రీ రూపాన్ని పొందుతాడు. తాను ఎవరనే విషయాన్ని మరిచిపోయి వివాహం చేసుకుని సంతానాన్ని పొందుతాడు. ఆ తరువాత ఆ సంతానాన్ని కోల్పోయి .. విష్ణు మాయ నుంచి బయటపడతాడు. భావనారాయణస్వామి కోసం చాలాకాలం పాటు తపస్సు చేస్తాడు. నారదుడు స్నానమాడి స్త్రీ రూపాన్ని పొందిన సరస్సు .. ఆయన స్త్రీ రూపాన్ని పోగొట్టిన సరస్సు ఇప్పటికీ 'సర్పవరం' ఆలయానికి ఎదురుగా పక్కపక్కనే కనిపిస్తూ ఉంటాయి. నారదుడు తపస్సు చేసుకున్న ప్రదేశాన్ని .. ప్రతిష్ఠించిన భావనారాయణస్వామి మూర్తిని ఇక్కడ దర్శించుకోవచ్చు. పంచ భావనారాయణ స్వామి క్షేత్రాలలో ఒకటిగా ఇది విలసిల్లుతోంది.         


More Bhakti News