పాండురంగడే స్వయంగా వచ్చి పెరుగును ఆరగించాడు

నామదేవుడు .. జ్ఞానదేవుడు .. .. తుకారామ్ .. జనాబాయి .. సక్కుబాయి వంటి మహాభక్తులు పాండురంగస్వామి సేవలో తరించారు. అలాంటి భక్తుల జాబితాలో భక్త చోఖమేళా ఒకరుగా కనిపిస్తాడు. పాండురంగడు అంటే చోఖామేళాకి ప్రాణం .. అనునిత్యం ఆ స్వామి నామాన్ని స్మరిస్తూ ఉండేవాడు. ఆ స్వామి ఆలయంలోకి వెళ్లి ఆయన దర్శనం చేసుకోవాలనుకునేవాడు. అయితే అప్పట్లో వున్న అస్పృశ్యత కారణంగా చోఖామేళాకు ఆలయ ప్రవేశం ఉండేది కాదు.

దాంతో అనునిత్యం ఆ స్వామి దర్శనం చేసుకోవాలనే ఆలోచనతో ఆయన తన తోటలోనే పాండురంగడికి ఒక మందిరాన్ని నిర్మించుకున్నాడు. తనకి తెలిసిన విధంగా ఆ స్వామిని పూజిస్తూ .. సేవిస్తూ ఉండేవాడు. ఆ స్వామికి కమ్మని పెరుగంటే ఇష్టమని భావించి, ఒక రోజున నైవేద్యంగా సమర్పించాడు. ఆయన భక్తికి మెచ్చిన స్వామి స్వయంగా వచ్చి దర్శన భాగ్యాన్ని కలిగించడమే కాకుండా, ప్రత్యక్షంగా ఆ నైవేద్యాన్ని స్వీకరించాడు. అలా స్వామి దర్శనంతో చోఖా మేళా పొంగిపోయాడు .. ఆనంద బాష్పాలతో ఆ స్వామి పాదాల చెంత వాలిపోయాడు.       


More Bhakti News