కోరిక లేని చోటనే ఆనందం ఉంటుంది

ఒకసారి యదు మహారాజు వేటకి వెళ్లగా అక్కడ ఆయనకి ఒక అవధూత తారసపడతాడు. నిర్మానుష్యమైన ఆ అడవిలో ఆయన ఎంతో ఆనందంగా ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. అంత ఆనందంగా ఉండటానికి కారణమేమిటని అడుగుతాడు. అందుకు ఆ అవధూత స్పందిస్తూ .. " తన భార్య బిడ్డలు వలలో చిక్కడం చూసిన ఒక పావురం .. తనంతట తాను వచ్చి బోయవాడికి చిక్కడం చూశాను .. సంసారమనే వలలో చిక్కకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాను.

'ఎర'కు ఆశపడి గాలానికి చిక్కిన చేపలను చూశాను .. జిహ్వ చాపల్యాన్ని వదులుకోవాలనే విషయం అప్పుడే తెలిసింది. సుగంధాన్ని .. దుర్గంధాన్ని మోసే గాలి, దేనిని అంటించుకోకుండా సాగిపోతూ ఉంటుంది. అలా సుఖదుఃఖాలను అంటించుకోకుండా వుండాలని గ్రహించాను. జలాశయం తన చెంత చేరినవారిని పరిశుభ్రంగా ఉండేలా చేస్తుంది .. అలా నా చెంత చేరినవారిని పవిత్రులుగా చేయాలని నేను భావించాను. ఏ విషయం పట్ల కోరిక .. మమకారం .. వ్యామోహం లేకపోవడమే నేను ఇంత ఆనందంగా ఉండటానికి కారణం" అని చెప్పుకొచ్చాడు.   

More Bhakti Articles