త్రిమూర్తులు స్వయంభూ లింగాలుగా వెలసిన క్షేత్రం సుచీంద్రం

సాధారణంగా ఏ శైవ క్షేత్రంలోనైనా పరమశివుడు లింగరూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. ఇక ఆ స్వామితో పాటు బ్రహ్మ .. విష్ణుమూర్తి కూడా లింగరూపాల్లో దర్శనమిచ్చే క్షేత్రం ఒకటుంది .. అదే 'సుచీంద్రం'. తమిళనాడులోని అత్యంత ప్రాచీనమైన .. మహిమాన్వితమైన క్షేత్రాల్లో ఒకటిగా ఇది కనిపిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక గ్రంధాల్లో కనిపిస్తున్న దాని ప్రకారం .. పూర్వం అనసూయాదేవి పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి వచ్చిన త్రిమూర్తులు .. ఆమె పాతివ్రత్య మహిమ కారణంగా పసిబిడ్డలుగా మారిపోతారు.

ఈ విషయాన్ని నారద మహర్షి ద్వారా తెలుసుకున్న లక్ష్మీదేవి .. సరస్వతీదేవి .. పార్వతీదేవి ముగ్గురూ కూడా, తమ భర్తలకు పూర్వ రూపాన్ని ఇవ్వమని అనసూయను కోరడానికి ఆశ్రమానికి వస్తారు. వాళ్ల అభ్యర్థన మేరకు త్రిమూర్తులకు పూర్వరూపం వచ్చేలా అనసూయాదేవి చేస్తుంది. అప్పుడు త్రిమూర్తుల స్థానంలో మూడు స్వయంభూ లింగాలు ఆవిర్భవిస్తాయి. ఇదే ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత .. విశిష్టత. దేవేంద్రుడు సైతం అహల్య విషయంలో గౌతమ మహర్షి శాపానికి గురై, ఈ క్షేత్రంలో త్రిమూర్తులను పూజించి శాప విమోచనాన్ని పొందాడని స్థలపురాణం చెబుతోంది.     


More Bhakti News