సకల శుభాలనిచ్చే సీతారాముల కల్యాణోత్సవం


"శ్రీరామ రామ రామేతి .. రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం .. రామనామ వరాననే" రామ నామం జపించడం వలన .. విష్ణు సహస్రనామావళిని పఠించిన ఫలితం దక్కుతుందని సాక్షాత్తు సదా శివుడు .. పార్వతీదేవితో చెప్పినట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. అలాంటి శ్రీరామచంద్రుడు .. సీతా లక్ష్మణ హనుమ సమేతుడై అనేక ప్రదేశాల్లో కొలువయ్యాడు. దాదాపుగా రామాలయం లేని గ్రామమంటూ ఎక్కడా కనిపించదు. అందువల్లనే శ్రీరామనవమి రోజున ప్రతి ఊరులోను సీతారాముల కల్యాణం సందడి కనిపిస్తుంది .. ప్రతి ఊరు ఓ అయోధ్యలా అనిపిస్తుంది.

ఈ రోజున తమ ఇంట్లోని పెళ్లి అన్నట్టుగా అంతా కూడా తమ ఇళ్లకు తోరణాలు కట్టుకుని .. పూజా మందిరాలను అలంకరించి .. కొత్త బట్టలు ధరించి సీతారాములను ఆరాధిస్తారు. సీతారాములు ఆవిర్భవించిన ప్రసిద్ధ క్షేత్రాలకు గానీ .. దగ్గరలోని ఆలయాలకు గాని వెళ్లి స్వామివారి కల్యాణోత్సవాన్ని కనులారా తిలకిస్తారు. సీతారాముల కల్యాణ అక్షింతలను తలపై చల్లుకుని .. స్వామివారికి .. అమ్మవారికి చదివింపులు చదివించి సంతోషపడతారు. తీర్థ ప్రసాదాలుగా వడపప్పు - బెల్లం పానకం తీసుకుంటారు. సీతారాముల కల్యాణం జరిపించడం వలన ఆ ప్రాంతంలో కరవు అనేది ఏర్పడదు. సీతారాముల కల్యాణ వైభవాన్ని తిలకించడం వలన, సమస్త పాపాలు నశించి సకల శుభాలు కలుగుతాయి.      


More Bhakti News