కాళేశ్వరం

కాళేశ్వరం
సాధారణంగా ఏ శివాలయంలోనైనా గర్భగుడిలో ఒకే శివలింగం వుంటుంది. అలా కాకుండా ఒకే గర్భాలయంలో ఒకే పానపట్టంపై రెండు శివలింగాలు వుంటే ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. 'కాళేశ్వరం' క్షేత్రాన్ని దర్శించినప్పుడు అలాంటి ఆశ్చర్యమే కలుగుతుంది. మిగతా క్షేత్రాలకు భిన్నంగా కనిపించే ఈ క్షేత్రం కరీంనగర్ జిల్లాలో వెలసింది.

ఎంతో ప్రాచీనతను మరెంతో పవిత్రతను సంతరించుకున్న ఈ క్షేత్రం కాశీతో సమానమైనదని చెబుతారు. ఎందరో రాజులు ఈ క్షేత్ర అభివృద్ధికి తమవంతు కృషిచేస్తూ ... ప్రాచుర్యం కలిగిస్తూ వచ్చారు. ఇక స్థల మహాత్మ్యం విషయానికే వస్తే ... శివుడు ఇక్కడ ముక్తేశ్వరుడిగా వెలిశాడు. భక్తుల పట్ల ఆయన అనుగ్రహం కారణంగా, యమధర్మరాజుకి పనిలేకుండా పోయింది.

అదే విషయాన్ని ఆయన శివుడితో చెప్పి ఆయన పట్ల జనులకు గల భక్తి తనకి పనిలేకుండా చేసిందని అసహనాన్ని వ్యక్తం చేశాడట. దాంతో శివుడు ... లింగాకారంలో తన పక్కనే కొలువుదీరి ఉండమని చెప్పాడు. తనని దర్శించుకున్న వారు అతనిని దర్శించుకోనట్టయితే మోక్షం లభించదని అన్నాడు. అలాంటి వారికి కాలం ఆసన్నమైనప్పుడు నరకానికి తీసుకు వెళ్లమని చెప్పాడు.

అందుకు అంగీకరించిన యమధర్మరాజు, కాళేశ్వరుడిగా ఈ క్షేత్రంలో లింగరూపంలో అవతరించాడు. ఈ కారణంగానే గర్భాలయంలో రెండు శివలింగాలు కనిపిస్తాయి. శివుడు అనుగ్రహం కారణంగానే ఈ క్షేత్రం 'కాళేశ్వరం' గా ప్రసిద్ధి చెందింది. పర్వదినాల సమయంలో ఇక్కడ విశేష పూజలు ... ఉత్సవాలు జరుగుతుంటాయి.

More Bhakti Articles