ఇక్కడి నరసింహస్వామి ప్రత్యేకత అదే

ప్రహ్లాదుడిని రక్షించడం కోసం .. హిరణ్య కశిపుడిని శిక్షించడం కోసం అవతరించిన నరసింహస్వామి, అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. భక్తుల కోరిక మేరకు కొన్నిచోట్ల కొలువైతే .. దేవతల అభ్యర్థన మేరకు కొన్నిచోట్ల ఆవిర్భవించాడు. అలా ఆ స్వామి కొలువైన క్షేత్రం .. స్వామి పేరుతోనే 'నృసింహుల పల్లి'గా ప్రసిద్ధి చెందింది. కరీంనగర్ జిల్లా .. గంగాధర మండలం పరిథిలో ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. ఇక్కడి ఉగ్రనరసింహస్వామి 5 ముఖాలతో .. 16 చేతులతో దర్శనమిస్తుండటం విశేషం .. అదే ఈ క్షేత్రం ప్రత్యేకత కూడా.

ఇక్కడి కొండపై గల గుహలో హిరణ్యకశిపుని పొట్టను చీరుస్తూ స్వామివారు కనిపిస్తాడు. చాలాకాలం క్రితం ఒక భక్తుడికి కలలో స్వామి కనిపించి .. తన జాడను తెలియపరిచాడట. ఆ భక్తుడు స్వామివారి జాడను గ్రామస్తులకు తెలిపి, నిత్య పూజాభిషేకాలు జరిగేలా చేశాడట. ఇక్కడి స్వామివారిని దర్శించుకోవడం వలన .. పూజాభిషేకాలు నిర్వహించడం వలన సమస్త దోషాలు .. భయాందోళనలు .. అనారోగ్యాలు .. ఆపదలు తొలగిపోతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. ప్రాచీనమైన .. మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వలన అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


More Bhakti News