వేదవతి శాపమే రావణుడి పతనం

మాలావతి .. కుశధ్వజుల కుమార్తయే వేదవతి. మహా సౌదర్యవతి అయిన ఆమె ఓ అడవిలో తపస్సు చేసుకుంటూ ఉంటుంది. అదే సమయంలో ఆకాశ మార్గాన అటుగా వెళుతోన్న రావణుడు ఆమెను చూస్తాడు. ఆమెను చూసిన రావణుడు మోహావేశానికి లోనై .. తనని వివాహమాడవలసిందిగా కోరతాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో, బలవంతంగా ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు.

దాంతో ఆమె యోగాగ్నిలో తనని తాను దహించుకుంటూ .. వచ్చే జన్మలో అయోనిజగా జన్మించి .. శ్రీహరిని వివాహమాడతానని చెబుతుంది. తన కారణంగా రావణుడి సంహారం జరుగుతుందంటూ శపిస్తుంది. అయితే ఆ శాపాన్ని రావణుడు పెద్దగా పట్టించుకోడు. ఆ తరువాత కొన్నాళ్లకు వేదవతియే .. అయోనిజగా భూమిలో జనకుడికి దొరుకుతుంది. సీత అనే పేరుతో ఆ ఇంటి గారాల బిడ్డగా పెరుగుతుంది. శ్రీమన్నారాయణుడి అవతారమైన శ్రీరామచంద్రుడికి అర్థాంగియై, ఆయన వెంట వనవాసానికి వెళుతుంది. ఆమెను అపహరించిన రావణుడు .. శ్రీరాముడి చేతిలో సంహరించబడతాడు. అలా వేదవతి శాపం .. రావణుడి పతనానికి కారణమవుతుంది. 


More Bhakti News