రామాయణ కాలంతో ముడిపడిన చదలవాడ

తండ్రి ఆజ్ఞ మేరకు సీతను .. లక్ష్మణుడిని వెంటబెట్టుకుని శ్రీరామచంద్రుడు అడవులకు బయలుదేరతాడు. శూర్పణఖకి జరిగిన అవమానం గురించి తెలుసుకున్న రావణాసురుడు, పథకం ప్రకారం సీతమ్మవారిని అపహరిస్తాడు. రామలక్ష్మణులు సీతమ్మవారి జాడను తెలుసుకోవడానికి బయలుదేరుతారు. ఈ ప్రయాణంలోనే వాళ్లకి హనుమంతుడు తారసపడతాడు. ఆయన ద్వారా సుగ్రీవుడితో పరిచయమవుతుంది.

సీతమ్మవారిని వెతికే బాధ్యత తమదంటూ శ్రీరాముడి మనసు కుదుటపడేలా సుగ్రీవుడు చేస్తాడు. ఆ తరువాత సుగ్రీవుడి ఆదేశం మేరకు వానర సైన్యం బయలుదేరుతుంది. అలా సీతాన్వేషణకి బయలుదేరిన వానర సైన్యం ఒక ప్రదేశంలో నాలుగు జట్లుగా విడిపోయి .. నాలుగు దిక్కులకి వెళ్లారట. ఈ కారణంగానే ఈ ప్రదేశానికి 'చతుర్వాడ'అనే పేరు వచ్చిందనీ .. కాలక్రమంలో అది 'చదలవాడ'గా మారిందని అంటారు. రామాయణ ఘట్టాలతో ముడిపడిన ప్రాచీన క్షేత్రాలలో చదలవాడ ఒకటిగా కనిపిస్తూ ఉంటుంది. ఈ క్షేత్రంలో ప్రాచీనకాలం నాటి పరమేశ్వరుడి ఆలయం .. రఘునాయక ఆలయం దర్శనమిస్తూ ఉంటాయి. ఈ క్షేత్రం పరమ పవిత్రమైనదనీ .. మహిమాన్వితమైనదని భక్తులు విశ్వసిస్తుంటారు.           


More Bhakti News