మట్టపల్లి

మట్టపల్లి
కృష్ణా నదీ తీరంలో వెలసిన నృసింహస్వామి క్షేత్రాలలో 'మట్టపల్లి' ఒకటి. నల్గొండ జిల్లా ... హుజూర్ నగర్ సమీపంలోని ఈ క్షేత్రంలో స్వామి లక్ష్మీ సమేతుడై వెలిశాడు. యోగానంద లక్ష్మీ నృసింహస్వామిగా భక్తులచే పూజలు అందుకుంటున్నాడు. స్వయం వ్యక్తమైన స్వామివారిని తొలినాళ్లలో మునులు ... ఋషులు ... దేవతలు మాత్రమే పూజిస్తూ ... సేవిస్తూ వుండేవారట. సాధారణ మానవులకు అప్పుడు స్వామివారి జాడ తెలియదు.

ఇక తాను మానవులను అనుగ్రహించ వలసిన సమయం ఆసన్నమైనదని భావించిన నృసింహస్వామి, బాహ్య ప్రపంచానికి తన జాడ తెలిజేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పట్లో ఆ ప్రాంతం అనుముల మాచిరెడ్డి ఏలుబడిలో వుండేది. తన భక్తుడైన ఆయనకి కలలో స్వామి కనిపించి, తాను ఫలాన గుహలో ఉన్నట్లుగా చెప్పాడు. ఇక నుంచి భక్త జనకోటి తన దర్శనం చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయమని చెప్పాడు.

మరునాడు ఉదయమే అతను గ్రామస్తులను వెంటతీసుకు వెళ్లి అతి కష్టం మీద ఆ గుహను కనుక్కోగలిగాడు. స్వామివారి దివ్య మంగళ స్వరూపం చూడగానే ఆయన కళ్లలో ఆనంద బాష్పాలు చోటుచేసుకున్నాయి. ఆ పరిసర ప్రాంతాల్లో స్వామి వారి గురించిన ప్రకటనలు చేయించి, ఆలయాన్ని నిర్మించాడు. నిత్య పూజలు ... విశేష పూజలు ... ప్రత్యేక ఉత్సవాలకి సంబంధించిన ఏర్పాట్లు చేయించాడు. ఆ తరువాత కాలంలో స్వామివారి భక్తులు ఒక్కొక్కరిగా ఆలయ అభివృద్ధిలో పాలు పంచుకున్నారు.

కృష్ణా నదిలో స్నానమాచరించి స్వామివారి దర్శనం చేసుకుంటే, మానసిక పరమైన ... శారీరక పరమైన వ్యాధులు వెంటనే తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ఇక తాము అనుకున్నది జరిగితే స్వామి వారి సన్నిధిలో మూడు రాత్రులు నిద్ర చేస్తామని భక్తులు మొక్కుకుంటూ వుంటారు. అలా నిద్రచేసే వారి సంఖ్య ఇక్కడ ఎక్కువగానే కనిపిస్తుంది. స్వామివారు కలలో కనిపించి భక్తుల సమస్యలను పరిష్కరించిన సంఘటనలు కూడా లేకపోలేదు.

More Bhakti Articles