వ్యాధులను నివారించే కాశీ క్షేత్రంలోని విమలాదిత్యుడు

విశ్వనాథుడు .. విశాలాక్షి అమ్మవారు కొలువైన కాశీ క్షేత్రాన్ని దర్శించడం వలన మళ్లీ జన్మనేది ఉండదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువల్లనే కాశీ క్షేత్రాన్ని తప్పకుండా దర్శించాలనే కోరిక మనసులో బలంగా ఉంటుంది. పురాణపరమైన అనేక ఘట్టాలకు .. విశేషాలకు నెలవుగా కాశీ క్షేత్రం కనిపిస్తుంది. పాపాలను పటాపంచలు చేసే ఈ క్షేత్రంలో .. పన్నెండు సూర్య దేవాలయాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కో ఆలయం వెనుక ఒక్కో విశేషం వినిపిస్తూ ఉంటుంది. వాటిలో విమలాదిత్యుని ఆలయం ఒకటి.

ఒకప్పుడు .. 'విమలుడు' అనే మహారాజుకు కుష్ఠువ్యాధి వస్తుంది. తన పరిస్థితికి ఆ రాజు ఎంతగానో బాధపడతాడు. రాజ్యాన్ని .. భార్యా బిడ్డలను కూడా వదిలి కాశీ క్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ సూర్యభగవానుడి ప్రతిమను ప్రతిష్ఠించి అనునిత్యం ఆరాధించడం మొదలుపెడతాడు. ఆయన భక్తికి మెచ్చిన సూర్య భగవానుడు ప్రత్యక్షమై, కుష్ఠువ్యాధి నుంచి విముక్తిని కలిగిస్తాడు. ఆయన ఆరాధించిన సూర్యభగవానుడి మూర్తి .. విమలాదిత్యుని పేరుతో పూజలు అందుకుంటుందని అనుగ్రహిస్తాడు. ఇక్కడి స్వామిని దర్శించుకుని .. అంకితభావంతో ఆరాధిస్తే, వ్యాధులు నివారించబడతాయనేది భక్తుల విశ్వాసం.    
  


More Bhakti News