భీష్మ ఏకాదశి ప్రత్యేకత

ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి. ఒక్కో ఏకాదశి ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. ప్రతి ఏకాదశి శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైనదే .. ఆయన అనుగ్రహాన్ని అందించేదే. అలా మాఘ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని 'భీష్మ ఏకాదశి' అని అంటారు. సాక్షాత్తు శ్రీకృష్ణుడే .. భీష్ముడి పేరుమీద ఈ ఏకాదశి విశిష్టమైనదిగా నిలుస్తుందని చెప్పినట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

ఈ భీష్మ ఏకాదశి రోజున చాలా క్షేత్రాల్లో స్వామివారి కల్యాణోత్సవం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా 'అంతర్వేది' లక్ష్మీనరసింహా స్వామి .. 'ఊడిపూడి' లక్ష్మీ నరసింహ స్వామి .. 'పట్టిసీమ' వీరభద్రస్వామి కల్యాణోత్సవం భీష్మ ఏకాదశి రోజునే జరుగుతూ ఉంటాయి. ఈ ఏకాదశి రోజున ఉపవాస దీక్షను చేపట్టి, శ్రీమహా విష్ణువును కీర్తిస్తూ జాగరణ చేయాలి. మరునాడు ద్వాదశి ఘడియలు ఉండగానే శ్రీ మహా విష్ణువును ఆరాధిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించాలి. ఈ విధంగా చేయడం వలన పాపాలు .. శాపాలు .. దోషాలు తొలగిపోతాయనేది మహర్షుల మాట.      


More Bhakti News