శ్రీరంగం

శ్రీరంగం
శ్రీరంగం ... 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో తొలి స్థానాన్ని ఆక్రమించింది. దేశంలోనే అతిపెద్ద వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లుతోన్న ఈ క్షేత్రం తమిళనాడు - తిరుచ్చి సమీపంలో వెలసింది. సువిశాలమైన ప్రాంగణం ... పొడవుగా ఎత్తుగా కనిపించే ఏడు ప్రాకారాలు ... ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్టుగా కనిపించే రాజగోపురాలు ... అడుగడుగునా ఆశ్చర్యపరిచే శిల్పకళా ... శ్రీ రంగ క్షేత్ర వైభవానికి అద్దం పడుతుంటాయి. ఇక్కడి సప్త ప్రాకారములలో పరివార దేవతలు ... అనేక సన్నిధి మంటపాలు కొలువుదీరి కనిపిస్తుంటాయి.

సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు స్వయం వ్యక్తమైన ఎనిమిది దివ్య క్షేత్రాలలో ఇది ప్రధానమైనదిగా చెప్పబడుతోంది. ఇక్కడ ప్రవహించే కావేరి ... కొళ్లిడం నదులు శ్రీరంగ క్షేత్రానికి పూలహారంలా కనిపిస్తూ వుంటాయి. స్వామివారికి సంబంధించిన తొమ్మిది తీర్థాలు ఈ క్షేత్ర పరిసర ప్రాంతాల్లో చూడవచ్చు.

గర్భాలయంలో స్వామివారు ఆదిశేషుడి పడగ నీడలో సేదతీరుతూ కనిపిస్తాడు. మూలమూర్తిని 'పెరియ పెరుమాళ్' అనీ ... ఉత్సవ మూర్తిని 'నంబెరుమాళ్' అనీ ... అమ్మవారిని రంగనాయకి అనీ ... ఆండాళ్ అని పిలుస్తూ వుంటారు. స్వామివారికి ఎదురుగా గల బంగారు స్తంభాలను 'తిరుమాణియై త్తూన్' గా భావిస్తుంటారు. స్వామివారి సమ్మోహన సౌందర్య ప్రవాహంలో భక్తులు కొట్టుకుపోకుండా ఈ స్తంభాలు ఆడ్డుకుంటాయని చెబుతుంటారు. ఇక గర్భాలయానికి ముందున్న ప్రదేశాన్ని 'చందన మంటపం'అనీ ... స్వామివారు నైవేద్యములు స్వీకరించు ప్రదేశమును 'గాయత్రీ మంటపం'అని అంటారు.

నవగ్రహ క్షేత్రాలలో 'శుక్ర క్షేత్రం'గా చెప్పబడుతోన్న శ్రీరంగంలో స్వామివారు రంగనాథుడిగా అవతరించడానికి గల కారణాన్ని మనకి స్థల పురాణం చెబుతోంది. పూర్వం బ్రహ్మ దేవుడు తనని గురించి తపస్సు చేసిన ఇక్ష్వాకు మహారాజు భక్తిని ప్రశంసిస్తాడు. తన ఆరాధ్య దైవమైన శ్రీరంగనాధుడి విమానము(గర్భాలయ గోపురం)ను ఇక్ష్వాకు మహారాజుకు ఇస్తాడు. వంశపారంపర్యంగా రంగనాథ స్వామిని శ్రీరామచంద్రుడు కూడా పూజిస్తాడు. రావణ వధ అనంతరం శ్రీ రాముడి ఎడబాటును విభీషణుడు భరించలేక పోతాడు. దాంతో తనకు మారుగా శ్రీ రంగనాధుడి విమానమును విభీషణుడికి ఇస్తాడు.

దానిని తీసుకుని లంకకు బయలుదేరిన విభీషణుడు ... సంధ్య వార్చుకోవడానికి కావేరి నది దగ్గర ఆగుతాడు. శ్రీ రంగనాథ విమానమును తలపై నుంచి దించి ఓ ప్రదేశంలో వుంచి వెళతాడు. అతను తిరిగి వచ్చేలోగా ధర్మవర్మ అనే రాజు ఆ స్వామిని పూజిస్తూ కనిపిస్తాడు. విభీషణుడిని బతిమాలి ఆ రాజు పూజ పూర్తి చేస్తాడు. కానీ ఆ తరువాత ఆ విమానం అక్కడి నుంచి ఎంతగా కదిలించడానికి ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోతుంది.

పూర్వం ధర్మ వర్మకు ఇచ్చిన మాట మేరకు తాను ఆ ప్రదేశంలో వెలసినట్టు రంగనాధుడు చెబుతాడు. విభీషణుడి కోరికను కూడా తాను అక్కడ నుంచే నెరవేరుస్తానని హామీ ఇస్తాడు. అలా శ్రీ రంగనాధుడు ఇక్కడ కొలువుదీరాడు. మొదటి సారిగా ధర్మవర్మ ఆలయాన్ని నిర్మించగా, తరువాత కాలంలో చోళ ... పాండ్య .. విజయనగర రాజులు ఆలయ అభివృద్ధిలో కీలకమైన పాత్రను పోషించినట్టు చరిత్ర చెబుతోంది.

ఈ క్షేత్రంలో పుష్య .. మాఘ .. చైత్ర మాసములందు నాలుగు బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి. ధనుర్మాసంలోను ... వైకుంఠ ఏకాదశి సందర్భంగాను ఇక్కడ ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. ఆ సమయంలో భూలోక వైకుంఠ నాధుడిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు.

More Bhakti Articles