తొలి తిరుపతి

తొలి తిరుపతి
సాధారణంగా తిరుపతి అనగానే చిత్తూరు జిల్లాలోని ఏడు కొండలపై వెలసిన శ్రీనివాసుడే కళ్లెదుట కదులుతాడు. కానీ తిరుపతి పేరుతో మరో పుణ్య క్షేత్రం వుంది. అది తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురం మండలంలో వెలసి 'తొలి తిరుపతి'గా పూజలు అందుకుంటోంది. ఈ క్షేత్రంలో కొలువుదీరిన కోనేటి రాయుడు ... ఇక్కడ మాత్రం తన భక్తులతో 'శృంగార వల్లభస్వామి'గా పిలిపించుకుంటూ ఉంటాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వెలసిన ఈ క్షేత్రానికి వేల సంవత్సరాల నాటి చరిత్ర వుందని ... దేవతలంతా కలిసి ఈ దేవాలయాన్ని నిర్మించారని స్థలపురాణం చెబుతోంది.

సవతి తల్లి కారణంగా తండ్రి ఒడిలో కూర్చోలేక పోయిన ధ్రువుడు తల్లి దగ్గర తన ఆవేదనను వ్యక్తం చేస్తే, ఆ కోరిక నెరవేరాలంటే శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేయమని తల్లి సలహా ఇస్తుంది. అప్పుడు తల్లి మాట మేరకు ధ్రువుడు తపస్సు చేసి శ్రీ హరి అనుగ్రహాన్ని పొందిన ప్రదేశమే ... ఈ క్షేత్రంగా మారింది. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమైనప్పుడు బలిష్ట మైనటువంటి ఆయన ఆకారాన్ని ... ఆ మహా తేజస్సును చూసిన ధృవుడు భయపడిపోయాడట. అప్పుడు ఆయన ధృవుడిని దగ్గరకి తీసుకుని '' భయపడకు ... నీనూ నీ అంతే కదా వున్నాను'' అంటూ ధైర్యం చెప్పాడట. ఇందుకు నిదర్శనంగా ఎవరైతే స్వామివారి దర్శనం చేసుకుంటారో వారి ఎత్తుకు తగినట్టుగా మూలవిరాట్టు కనిపిస్తుందని చెబుతుంటారు.

ధృవుడి కోరికమేరకు స్వామివారి ఈ ప్రదేశంలో వెలిశాడు. అ తరువాత కాలంలో నారద మహర్షి ఇక్కడ లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్టించాడు. ఇక కలియుగంలో ఈ క్షేత్రంలో భూదేవి విగ్రహాన్ని శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠించినట్టు శాసనాలు కనిపిస్తాయి. శ్రీ మహావిష్ణువు భూమిపై మొదటిసారిగా వెలిసింది ఇక్కడే కాబట్టి ఈ క్షేత్రాన్ని 'తొలి తిరుపతి'గా పిలుస్తుంటారు. భోజరాజు ... విక్రమార్కుడు ... రుద్రమదేవి ... పెద్దాపురం సంస్థానాధీశులు ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నట్టు ఆధారాలు వున్నాయి. 'చైత్ర శుద్ధ ఏకాదశి' రోజున స్వామివారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా విశేషమైన సంఖ్యలో విచ్చేసే భక్తులు తమ మొక్కులు చెల్లించుకుని తరిస్తుంటారు.

More Bhakti Articles