అగస్త్యేశ్వరం

అగస్త్యేశ్వరం
ఉరుకులు ... పరుగులుతీస్తూ ప్రవహించే గోదావరి నదీ తీరంలో ఎన్నో పుణ్య క్షేత్రాలు కొలువుదీరి కనిపిస్తాయి. ఎందరో కవుల ఊహలకు రెక్కలు తొడిగిన గోదావరి, పుణ్య నదిగా భక్తుల నీరాజనాలు అందుకుంటోంది. గలగలా ప్రవహిస్తూ సకలపాపాలను కడిగివేసే ఈ పుణ్య నదీ తీరంలో వెలసిన క్షేత్రాలలో 'అగస్త్యేశ్వర ఆలయం' ఒకటి. ఈ దివ్య క్షేత్రం ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరులో విలసిల్లుతోంది.

ద్వాపర యుగంలో ఈ ప్రాంతంలో తపస్సు చేసుకోవడానికి వచ్చిన అగస్త్యుడు, ఇక్కడి ప్రకృతికి ... పవిత్రతకు ముచ్చటపడి ఓ భారీ శివలింగాన్ని ప్రతిష్టించాడు. అందుకే ఈ క్షేత్రానికి 'అగస్త్యేశ్వర ఆలయం' అనే పేరు వచ్చింది. క్రీ.శ.1289లో ఈ ఆలయాన్ని కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు పునః నిర్మించగా, ఆ తరువాత కాలంలో అలావుద్దిన్ ఖిల్జీ దాడుల కారణంగా గాలిగోపురం వంటివి ధ్వంసమయ్యాయి. తదనంతర కాలంలో శ్రీకృష్ణదేవరాయలు ఈ దేవాలయాన్ని పునఃనిర్మించినట్లు ఇక్కడ శాసనాధారాలు కనిపిస్తున్నాయి.

ఇక ఈ దేవాలయంలో వెలిగించిన అఖండ జ్యోతి 410 సంవత్సరాలుగా వెలుగుతూనే ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటూ వుంటారు. సాధారణంగా నదులన్నీ పశ్చిమ దిశ నుంచి తూర్పు దిశకు ప్రవహిస్తుంటాయి. అందుకు భిన్నంగా ఈ క్షేత్రంలో గోదావరి 15 కిలోమీటర్ల వరకూ ఉత్తరదిశకు ప్రవహిస్తుంది. ఇక్కడికి సమీపంలో వున్న పారుపల్లి గుట్టలపై దిగంబరంగా కొలువుదీరిన భైరవుడిని చూడలేకే గోదావరి ఇలా ప్రవాహదిశను మార్చుకుందని చెబుతారు. ఈ పాయలోనే హనుమంతుడి తల్లి అంజనాదేవి స్నానమాచరించిందని స్థలపురాణం చెబుతోంది.

ఇక గోదావరి పుష్కరాల కాలంలో భక్తులు విశేషసంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. శివరాత్రి పర్వదినం రోజున ఇక్కడి అఖండ జ్యోతికి ప్రత్యేక పూజలు నిర్వహించి, శివపార్వతులకి కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుతుంటారు. అటు పురాణం నేపథ్యం ... ఇటు చారిత్రక నేపథ్యం గల ఈ పుణ్యక్షేత్రం అణువణువునా భక్తిభావ పరిమళాలను వెదజల్లుతూనే వుంటుంది.

More Bhakti Articles