కాళేశ్వర క్షేత్ర దర్శనమే చాలు

కాళేశ్వర క్షేత్ర దర్శనమే చాలు
సాధారణంగా ఏదైనా శైవ క్షేత్రానికి వెళితే గర్భాలయంలో ఒక శివలింగమే దర్శనమిస్తూ ఉంటుంది. అలా కాకుండా ఒకే పానవట్టంపై రెండు శివలింగాలు కనిపిస్తే దాని వెనుక పురాణ సంబంధమైన కథ ఏదో వున్నట్టేనని అనుకోవాలి. అలా ఒకే పానవట్టం పై రెండు శివలింగాలు కలిగిన క్షేత్రంగా 'కాళేశ్వరం' విలసిల్లుతోంది. గౌతమ మహర్షి కఠోర తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమైన పరమశివుడు, ఆయనకి ముక్తిని ప్రసాదించాడు కనుక, స్వామిని 'ముక్తీశ్వరుడు' పేరుతో పూజిస్తుంటారు.

ముక్తీశ్వర లింగం పక్కనే 'కాళేశ్వర లింగం' దర్శనమిస్తుంది. తన పేరుతో ఈ శివలింగాన్ని సాక్షాత్తు యమధర్మ రాజు ప్రతిష్ఠించాడని స్థల పురాణం చెబుతోంది. కాళేశ్వరుడిని ముందుగా పూజించడం వలన నరక బాధలు లేకుండా చేస్తానని సాక్షాత్తు యమధర్మరాజే సెలవిచ్చాడట. అందువలన ఈ క్షేత్రంలో ముందుగా కాళేశ్వరుడికి .. ఆ తరువాత ముక్తీశ్వరుడికి పూజలు జరుగుతూ ఉంటాయి. కాళేశ్వర క్షేత్ర దర్శనమే చాలు .. సమస్త పాపాలను నశింపజేసి, సకల శుభాలను చేకూర్చుతుంది. 

More Bhakti Articles