శ్రీ శక్తేశ్వరం

అందరికీ అందుబాటులో ఉండటం కోసం ... అందరినీ అనుగ్రహించడం కోసం దేవుడు వివిధ నామాలతో ... వివిధ ప్రాంతాల్లో వెలుస్తుంటాడు. అలా వెలసిన శైవక్షేత్రమే పశ్చిమ గోదావరి జిల్లా ... యనమదుర్రులోని 'శ్రీ శక్తేశ్వర ఆలయం'. అందమైన ప్రకృతి ఒడిలో ... ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ క్షేత్రం భక్త జనావళికి ఆహ్వానం పలుకుతుంటుంది. సాధారణంగా శైవ క్షేత్రాల్లో శివుడు లింగాకారంలోనో ... విగ్రహ రూపంలోనో సవ్యంగా దర్శనమిస్తుంటాడు. కానీ అందుకు భిన్నంగా ఇక్కడ శివ పార్వతులు విచిత్రమైన రీతిలో దర్శనమిస్తుంటారు. తలకిందులుగా శివుడు ... మూడు నెలల శిశువైన కుమారస్వామిని పక్కనే కూర్చుండ బెట్టుకుని బాలింతరాలైన పార్వతి ఇక్కడ కనిపిస్తారు.

ఇక్కడి స్థలపురాణం పరిశీలిస్తే ఇందుకుగల కారణం మనకి తెలుస్తుంది. పూర్వం ఈ గ్రామానికి 'యమునా పురం' అనే పేరు వుండేది. మహిషాసురుడి అనుచరుడైన శంభాసురుడు ఇక్కడ మునుల తపోదీక్షకు భంగంకలిగిస్తూ వారిని నానారకాలుగా బాధించసాగాడు. మునుల కోరిక మేరకు ఆ రాక్షసుడిని సంహరించడానికి యమధర్మరాజు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దాంతో అతను శివుడి కోసం ప్రార్ధించాడు. శివుడు తల కిందులుగా తపస్సు చేసుకుంటూ ఉండటంతో, పార్వతి రంగంలోకి దిగింది. ఆ సమయంలో ఆమె బాలింతరాలు. యమధర్మరాజు కోరిక మేరకు ఆమె శంభాసురుడిని సంహరించింది.

ఇకపై రాక్షసులు ఆ ప్రాంతంలో సంచరించకుండా, ఉన్నపళంగా శివపార్వతులను అక్కడ కొలువుదీరవలసిందిగా కోరాడు యమధర్మరాజు. దాంతో తలకిందులుగా ఉన్న శివుడు ... బాలింతరాలుగా ఉన్న పార్వతీదేవి అదే విధంగా అక్కడ వెలిశారు. ఈ ఆలయ ప్రాంతంలో ఉన్న శక్తి గుండమనే చెరువు ఎంతో మహిమాన్విత మైనదిగా చెబుతుంటారు. శివరాత్రి సందర్భంగా ... కార్తీక మాసంలోను ... సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాల్లో ఇక్కడ ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతుంటాయి. ఈ ఉత్సవాలను తిలకించడానికి భక్తులు విశేష సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు.


More Bhakti News