వేములవాడ

వేములవాడ
'వేములవాడ'లో రాజరాజేశ్వరీ దేవి సమేతుడై వెలసిన శ్రీ రాజరాజేశ్వరస్వామిని భక్తుల పాలిట కొంగుబంగారంగా చెబుతుంటారు . కరీంనగర్ పట్టణానికి సమీపాన వెలసిన ఈ క్షేత్రం ... ఆంద్రప్రదేశ్ లోని అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా అలరారుతోంది. 'దేవుడు' అనే మాట జానపదులు పలకడంలో 'వేముడు'గా మారిపోయింది.ఫలితంగా దేవుడువాడ కాస్తా వేములవాడగా మారిపోయింది.

నారద మహర్షి కోరిక మేరకు కాశీ విశ్వనాథుడు ఇక్కడ కొలువుదీరినట్టు స్థలపురాణం చెబుతోంది. త్రేతాయుగంలో శ్రీ రామచంద్రుడు ... ద్వాపర యుగంలో పాండవులు ఈ క్షేత్రాన్ని దర్శించి అమూల్యమైన వరాలను పొందినట్టు తెలుస్తోంది. మొట్టమొదటిసారిగా మాళవ ప్రభు శ్రీ రాజరాజ నరేంద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఆ తరువాత క్రీ. శ. 750 - 973 ప్రాంతంలో చాళుక్య రాజులు పునః నిర్మించినట్టు తెలుస్తోంది.

ఇక ప్రధాన దేవాలయంలో, రాజరాజేశ్వరుని కుడిభాగాన రాజరాజేశ్వరీ దేవి ... ఎడమ వైపున లక్ష్మీ గణపతి దర్శనమిస్తారు. ప్రధాన ఆలయంతో పాటు ఇక్కడ అనేక మందిరాలు కొలువుదీరి కనిపిస్తాయి. ఆలయ ముఖద్వారానికి ఎదురుగా అనంత పద్మనాభస్వామి దేవాలయం దర్శనమిస్తూ ధన్యులను చేస్తూ వుంటుంది. ఇక్కడ కనిపించే 'ధర్మకుండం' మహా పవిత్రమైనదని చెబుతుంటారు. ఈ నీటితోనే మూల మూర్తులకు ... ఉత్సవ మూర్తులకు అభిషేకాదులు నిర్వహిస్తుంటారు. ఈ ధర్మకుండం చుట్టూ అయిదు శివలింగాలు కనిపిస్తూ వుంటాయి. వీటితో కలిపి ఈ దేవాలయంలో మొత్తం 22 శివలింగాలు వుండటం విశేషంగా అనిపిస్తూ వుంటుంది.

ఇక్కడ 'కోడె కట్టుట' అనే పేరుతో కోడె దూడలను స్వామివారికి మొక్కుబడిగా సమర్పించే ఆచారం ఉంది. భక్తులు తమ సమస్యలు తీరినందుకు ... ఆపదల్లో నుంచి బయట పడినందుకు స్వామివారికి చెల్లించే ప్రధానమైన మొక్కుబడి ఇదే. మహా శివరాత్రి ... శ్రీ రామనవమి ... నవరాత్రులు వంటి పర్వ దినాలు ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహిస్తూ వుంటారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు.

More Bhakti Articles