శ్రాద్ధ కర్మలు

దేహాన్ని విడిచిపెట్టిన జీవం ... అనంతమైన శూన్యంలో కలిసిపోతుంది. అలా మన మధ్య నుంచి శాశ్వతంగా దూరమైన వారికి శ్రాద్ధ కర్మలు నిర్వహించడమనేది తరతరాలుగా వస్తోన్న ఆచారం. చనిపోయిన వారికి శ్రాద్ధ కర్మలు నిర్వహించడం వలన పరలోకంలో గల ఏడుతరాల పూర్వీకులు సంతృప్తి చెందుతారని శాస్త్రం చెబుతోంది.

చనిపోయిన వారికి నువ్వులు ... దర్భలు ... మంత్రాల సహాయంతో ఏదైతే శ్రద్ధగా అందించాలనుకుంటున్నామో అదే శ్రాద్ధముగా చెప్పబడుతోంది. ఒక వ్యక్తి చనిపోయిన తరువాత పదిరోజుల పాటు జరుగు క్రియలు ... సంవత్సర కాలం పూర్తి అయిన తరువాత చేసే 'సపిండీ కరణ' తరువాత ఆ వ్యక్తి ఆత్మ పితృలోకానికి చేరుకుంటుందని 'మనుధర్మ శాస్త్రం' చెబుతోంది.

అంతరిక్షంలోని మూడవ కక్ష్యలో 'పితృ దేవతలు' ఉంటారనీ, శ్రాద్ధ కర్మల ద్వారా తమ కుటుంబీకులు సమర్పించేవి ఈశ్వరుడు ప్రసాదించిన శక్తితో అందుకుంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. చనిపోయిన వారు గతంలో తమకి అందించిన సేవలను గుర్తు పెట్టుకుని వారిపట్ల కృతజ్ఞతా పూర్వకంగా చేసే కార్యక్రమంగా దీనిని పేర్కొనవచ్చు. చనిపోయిన వారికి సద్గతి లభించాలనే సంకల్పం ... ఏడాదికి ఒకసారైనా పితృదేవతలను స్మరించుకోవలాసిన అవసరముందనే విషయం ఈ ఆచారంలో అర్థంగా కనిపిస్తుంది.

More Bhakti Articles