అదే భక్తులకు భగవంతుడు ఇచ్చే స్థానం !

భక్తుడు .. భగవంతుడి నామాన్ని సదాస్మరిస్తూ వుంటాడు. ఆ స్వామి లీలావిశేషాలను గురించి గానం చేస్తూ వుంటాడు. ఆయన వైభవాన్ని చూస్తూ పరవశించిపోతుంటాడు. భగవంతుడిని సేవించేవారు ఎంతోమంది .. అందులో తాను ఒకడు మాత్రమే. కానీ తనకి మాత్రం అన్నీ ఆయనే. తన ఆనందం ... అనుభూతి అన్నీ ఆయనతోనే.

భక్తుడు భోగభాగ్యాలను కోరుకోడు ... ఆయన పాదసేవను తప్ప మరేదీ ఆశించడు. జీవం ఉన్నంత వరకూ ఆ స్వామిని సేవిస్తూ వుండాలి ... స్వామిని సేవించేంత ఓపిక ఉన్నంత వరకు మాత్రమే జీవించి వుండాలని భావిస్తారు. అలా పరమాత్ముడి సేవయే పరమార్థంగా విశ్వసించిన భక్తులు ఎంతోమంది వున్నారు. నవవిధ భక్తిమార్గాలలో వాళ్లు ఏ మార్గాన్ని అనుసరించినా, అందరూ కోరుకునేది ఆ స్వామి సన్నిధిలో తరించడమే.

ఇక నవవిధ భక్తిమార్గాలలో ఏ మార్గంలోకి అడుగుపెట్టినా అది నేరుగా భగవంతుడి సమీపానికే చేరుస్తుంది. పొలం గట్టుపైగల చెట్టుకి గుడ్డ ఊయల కట్టి అందులో పసిబిడ్డను వుంచి పనిచేసుకునే తల్లి, ఆ బిడ్డ ఏడుపు వినగానే ఎలా పరిగెత్తుకు వస్తుందో, భగవంతుడు కూడా తన కోసం పరితపించే భక్తుల దగ్గరికి అలాగే పరిగెత్తుకు వస్తాడు.

ఇక ఆ భక్తులు తనని చూడకుండా క్షణమైనా ఉండలేరని గ్రహించిన స్వామి వారిని తనలో ఐక్యం చేసుకుంటాడు. తన క్షేత్రంలో ఆ భక్తులను సైతం దర్శించుకునే అదృష్టాన్ని మిగతావారికి కల్పిస్తాడు. ఈ కారణంగానే తిరుమల క్షేత్రంలో అన్నమయ్య .. తరిగొండ వెంగమాంబ, శ్రీకాళహస్తిలో కన్నప్ప .. భద్రాచలంలో రామదాసు, పండరీపురంలో జ్ఞానదేవ్ .. నామదేవ్ .. తుకారామ్ వంటి భక్తుల ప్రతిమలు దర్శనమిస్తూ వుంటాయి.

ఇలా ఆయా ప్రాంతాలలో గల క్షేత్రాల్లో అక్కడి మహాభక్తుల విగ్రహాలు కనిపిస్తూ వుంటాయి. భగవంతుడు ఎప్పటికీ ఉంటాడు ... ఆయన సేవలో తరించిన మహాభక్తుల కీర్తి ప్రతిష్ఠలు ఎప్పటికీ వుంటాయి. భగవంతుడి హృదయంలో భక్తులకు గల స్థానాన్ని ఇవి ఎప్పటికీ ఆవిష్కరిస్తూనే వుంటాయి.


More Bhakti News