స్వామికి తెలియనిది ఏవుంటుంది ?

మనసు అనేక ఆలోచనలతో తర్జనభర్జనలు పడుతూ వుంటుంది. సమస్యలతో సతమతమై పోతుంటుంది. ఒకవైపున ఆవేదన ... మరోవైపున ఆందోళన స్థిమితం లేకుండా చేస్తుంటాయి. అలాంటి మనసు ప్రశాంతతను కోరుకుంటుంది. ఆ ప్రశాంతత రాఘవేంద్రస్వామి దర్శనంతో లభిస్తుంది. సరస్వతీ కటాక్షం కారణంగా సంగీతంలోను ... పాండిత్యంలోను రాఘవేంద్రస్వామి అసమానమైన నైపుణ్యాన్ని ఆవిష్కరించాడు. ఆ సరస్వతీదేవి ఆదేశం మేరకే సన్యాసాశ్రమాన్ని స్వీకరించాడు. ఆ తరువాత ఆయన కనబరిచిన మహిమలు అన్నీఇన్నీ కావు.

ఎంతదూరంలో వున్నా ... ఎవరు ఏమనుకుంటోన్నా ఆయనకి క్షణాల్లో తెలిసిపోతూ వుండేది. తన శిష్యుడు మనసు వివాహం వైపు మళ్లిందనే విషయం కూడా ఆయనకి అలాగే తెలుస్తుంది. దాంతో శిష్యుడుకి ఆశీస్సులు అందించి అక్కడి నుంచి పంపించి వేస్తాడు. ఇక తనని పరీక్షించడానికి వచ్చిన ముగ్గురు బ్రాహ్మణులకు, వారు కోరుకున్నవి భోజనంలో వడ్డన జరిగేలా చేసి ఆశ్చర్యపోయేలా చేస్తాడు.

తనకి ఆతిథ్యం ఇచ్చినవారి కుమారుడు ప్రమాదవశాత్తు మరణించాడనే విషయం అతని తల్లిదండ్రులు చెప్పకపోయినా స్వామికి తెలిసిపోతుంది. ఆ పిల్లవాడిని పునర్జీవితుడిని చేసి తనసేవలో తరిస్తోన్న ఆ దంపతుల దుఃఖాన్ని దూరం చేస్తాడు. అనేక ప్రాంతాలను దర్శిస్తూ వెళుతోన్న ఆయన, తనపట్ల అపారమైన విశ్వాసాన్ని కలిగిన భక్తులను ఏదో ఒకలా కలుసుకుంటూ వాళ్లను అనుగ్రహిస్తూ ముందుకుసాగేవాడు. ఎదుటివారికి గల సమస్య ఏమిటో చూడగానే తెలుసుకుని వాటిని వాళ్లకి ప్రసాదించేవాడు.

అలా ఆరోగ్యం .. ఐశ్వర్యం .. సంతానం .. సౌభాగ్యం .. విద్య .. పదవి వంటివి పొందిన భక్తులు ఎంతోమంది వున్నారు. ఈనాటికీ స్వామి మహిమలు భక్తుల అనుభవాలుగా వినిపిస్తూ వుంటాయి. ఈ కారణంగానే మంత్రాలయం భక్తజన సముద్రంలా కనిపిస్తూ వుంటుంది. ప్రతి మనసు మందిరంలోను రాఘవేంద్రస్వామి నామస్మరణ మధురమైన మంత్రమై మోగుతుంటుంది.

More Bhakti Articles