సాయి చూపిన మహిమ అలాంటిది !

శిధిలావస్థలో గల మశీదును తన నివాసంగా చేసుకున్న బాబా, శిరిడీని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చేశాడు. భక్తుల మనసులను తన మందిరాలుగా చేసుకున్నాడు. బాబా అని ఆర్తితో పిలుస్తూ ఆయన మశీదుకి పరిగెత్తుకువచ్చిన వాళ్లెవరూ నిరాశానిస్పృహలతో తిరిగివెళ్లలేదు.

బాబాను చూడక చాలారోజులైంది ... ఆయన దర్శనం చేసుకోవాలనే భక్తులు ఎక్కువగా వుండేవాళ్లు. ఇక కొంతమంది భక్తులను చూడాలనిపించినప్పుడు, బాబాయే కబురుచేసి వాళ్లని పిలిపించేవాడు. ఒక్కోసారి బాబా భోజనం చేయకుండా కూర్చునేవాడు. తనకి ఇష్టమైన పదార్థాలు చాలాదూరం నుంచి వస్తున్నాయని సహచరులతో చెప్పేవాడు.

బాబా అన్నట్టుగానే ఆయన భక్తులలో ఎవరో ఒకరు ఆయనకి ప్రీతికరమైనవి చేసి తీసుకువచ్చేవారు. వాటిని అక్కడివారికి సంతోషంగా పంచిపెట్టి మిగతావి ఆరగించేవారు. ఆ పదార్థాలను తీసుకువచ్చినవారికి ఆ సమయంలో కలిగే సంతోషం అంతా ఇంతాకాదు. ఇక ఒక్కోసారి బాబా మిగతా రోజులకంటే ఎక్కువ చురుకుగా ... ఆనందంగా ఉండేవాడు.

నిత్యసేవలతో తన మనసు గెలుచుకున్న అతిథులు చాలాదూరం నుంచి వస్తున్నారనీ, వాళ్లకి ఇష్టమైన వంటకాలు తానే తయారుచేసేవాడు. అవి సిద్ధమైన కాసేపటికే వాళ్లు వచ్చేవాళ్లు. తనకోసం అలసట ఎరుగక వచ్చిన వాళ్లకి బాబా ఎంతో సంతోషంగా స్వయంగా వడ్డించేవాడు. ఆయన చూపే ప్రేమానురాగాలకు అందరిమనసులు పొంగిపోయేవి.

ఇలా తనకోసం ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారో ... తనపట్ల ప్రేమతో ఏమేం తెస్తున్నారో కూడా బాబాకి ముందుగానే తెలిసిపోయేది. అలా వచ్చేవాళ్లను నిరశపరచకూడదనే ఉద్దేశంతో బాబా వాళ్ల కోసం ఎదురుచూస్తూ కూర్చునేవాడు. అలాగే తన దర్శనం లభిస్తేచాలని అలసిపోయి వస్తోన్న వాళ్లను గురించి కూడా ఆయనకి ముందుగానే తెలిసిపోతూ వుండేది. అలాంటివారి ఆకలిబాధను అర్థంచేసుకున్నవాడిగా, వాళ్లు అక్కడికి చేరుకునేలోగా వంటను సిద్ధంచేసి ఆప్యాయంగా వడ్డించేవాడు.

ఇలా అందరి కదలికలు బాబాకి ముందే తెలిసిపోవడం ఆయన మహిమగా భక్తులు చెప్పుకునేవారు. ఆయన పలకరింపుతో బాధలు తొలగిపోతాయనీ ... ఆయన స్పర్శమాత్రం చేత వ్యాధులు నివారించబడతాయని విశ్వసించేవాళ్లు. తనని ఆరాధించేవారిని అవసరాల్లోను .. ఆపదల్లోను బాబా కాపాడుతూ ఉంటాడనే ఆయన భక్తుల నమ్మకానికి నిదర్శనంగా, ఊరూరా బాబా ఆలయాలు దర్శనమిస్తున్నాయి .. అడుగడుగునా అవి భక్తిభావ పరిమళాలను వెదజల్లుతున్నాయి.


More Bhakti News