చందనం

చందనం
ఇటు దేవాలయాలోను ... అటు ఇళ్లలోను జరిపే పూజాది కార్యక్రమాల్లో చందనం ఉపయోగిస్తూ వుంటారు. పసుపు ... కుంకుమలతో పాటు చందనం వాడటం కూడా తరతరాలుగా వస్తోన్న ఓ నియమంగా కనిపిస్తోంది. నోములు - వ్రతాల వంటివి చేసే సమయాల్లో స్త్రీలకు కంఠం దిగువ భాగాన ... పురుషులకు కుడి ముంజేయి పైన చందనం రాసే ఆనవాయతీ మనకి కనిపిస్తూ వుంటుంది. అలాగే ఇటు తిరుమల తిరుపతిలో శ్రీ వేకంటేశ్వర స్వామికి నిత్య సేవల్లో భాగంగా చందనం రాస్తూనే వుంటారు. ఇక సింహాచల నృసింహ స్వామికి ఏడాది పొడవునా చందనాన్ని అద్దుతూనే వుంటారు.

వైకుంఠ వాసుడైన శ్రీ మహావిష్ణువు భక్తుల దర్శనార్ధమై భూలోకంలో శ్రీ వేంకటేశ్వరుడిగా ఏడు కొండలపై వెలిశాడు. కొండలపై కొలువుదీరిన స్వామివారు వేడిని తట్టుకోవడం కోసమే ఆయన సేవల్లో చందనానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. అలాగే స్వామి నృసింహుని అవతారమే ఉగ్ర రూపంలో వుంటుంది కాబట్టి, ఆయనని చల్లబరిచి శాంతింప జేయడానికి చందనం అద్దడం చేస్తుంటారు.

చందనం ... శరీర సంబంధమైన దుర్గంధాన్ని దూరం చేయడమే కాకుండా, ఉష్ణోగ్రత నుంచి శరీరానికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. వంట్లోని అధిక వేడిని నియంత్రిస్తూ కాలుష్య నివారిణిగా పనిచేస్తుంది. చరకుడు ... శుశ్రుతుడు వంటివారు చందనంలోని ఔషధ గుణాలను గురించి తమ గ్రంధాలలో వివరించారు. ఈ కారణంగానే చందనం అనేది నిత్య పూజల్లో ఓ భాగమై పోవడమే కాకుండా, ఆరోగ్య పరిరక్షణలోను కీలకమైన పాత్రను పోషిస్తోంది.

More Bhakti Articles