మోక్షమిచ్చే భద్రాచలం

మోక్షమిచ్చే భద్రాచలం
ధర్మం ఎలా ఉంటుందంటే మూర్తీభవించిన శ్రీరామచంద్రుడిలా ఉంటుందనేది రుషి వాక్కు. తల్లిదండ్రుల పట్ల కొడుకు ఎలాంటి ప్రేమను కలిగి వుండాలో ... సోదరుల పట్ల ఎలాంటి అనురాగాన్ని కలిగి ఉండాలో ... భార్య పట్ల భర్త ఎలా నడచుకోవాలో ... ప్రజల పట్ల ప్రభువు ఎలా వ్యవహరించాలో ... శత్రువుల పట్ల వీరుడు ఎలాంటి వైఖరిని ప్రదర్శించాలో ... నిస్సహాయులను ఎలా ఆదుకోవాలనేది ఆచరించి చూపిన పుణ్యపురుషుడు ... శ్రీరామచంద్రుడు. అలాంటి శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై వెలసిన పవిత్ర పుణ్య క్షేత్రం 'భద్రాచలం'.

భద్రుడు అనే పర్వత రాజు తన తపోబలం కారణంగా శిలా రూపాన్ని పొందాడు. అరణ్యవాస సమయంలో ఈ కొండపై విశ్రమించిన శ్రీరామచంద్రుడు, భవిష్యత్తులో తాను ఇక్కడ నివసిస్తానని భద్రుడికి మాటిచ్చాడు. ఆ తరువాత రావణ సంహారం అనంతరం స్వామి వైకుంఠానికి వెళ్లి భద్రుడికి ఇచ్చిన మాట మరిచాడు. దాంతో భద్రుడు కఠోర తపస్సు చేయడంతో, అతనికిచ్చిన మాట గుర్తుకు రావడంతో, శంఖు చక్రాలు అపసవ్యంగా వున్నా పట్టించుకోకుండా సీతా లక్ష్మణ సమేతుడై భద్రుడికి దర్శనమిచ్చాడు. ఈ కారణంగానే ఇక్కడి స్వామివారు నాలుగు చేతులతో ... శంఖు చక్రాలను అపసవ్యంగా కలిగి కనిపిస్తాడు. రామావతార సమయంలో తాను ఇచ్చిన మాట మేరకు స్వామివారు ఇక్కడ వెలవడంతో, పరమపావనమైన ఈ ప్రాంతం భద్రగిరిగా ... భద్రాచలంగా ఖ్యాతికెక్కింది. భారతదేశంలో అత్యంత విశిష్టమైన 25 శ్రీరామ క్షేత్రాలలో, మరే ఇతర క్షేత్రంలో లేని ఈ ప్రత్యేకత భద్రాచలంలో మనకు కనిపిస్తుంది.

కొన్ని కారణాంతరాల వల్ల 14 - 15 శతాబ్దాలలో శ్రీరాముడి ఆలయం ఉనికి మసకబారగా ... 17 వ శతాబ్దం ప్రారంభంలో స్వామి వారు భద్రిరెడ్డి పాలెం నివాసి ... తన భక్తురాలు అయిన పోకల దమ్మక్కకు కలలో కనిపించి తన ఉనికిని తెలియ జేశాడు. అలాగే భద్రాచలం - పాల్వంచ పరగణా అధికారి అయిన కంచర్ల గోపన్నకు స్వామి స్వప్నంలో దర్శనమిచ్చి తనకి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించారు. ఈ నేపథ్యంలో రామదాసుగా మారిన కంచెర్ల గోపన్న చెరసాల పాలైనప్పుడు స్వామివారు మారువేషంలో తానీషా ప్రభువు చెంతకు వచ్చి తన పట్టాభిషేక చిహ్నం గల బంగారు మొహరీలను చెల్లించి భక్తుల పాలిట బంధువయ్యాడు. ప్రశాంతంగా కనిపించే ప్రకృతి ఒడిలో ... పవిత్రమైనటు వంటి గోదావరి నదీ తీరంలో అలరారుతోన్న ఈ పుణ్య క్షేత్రంలో, క్షేత్ర పాలకుడైన శ్రీ కాశీ విశ్వనాథ లింగ మందిరం ... శ్రీ ప్రపత్తి ఆంజనేయ స్వామి ఆలయం ... ఆది శంకరాచార్యులు తపస్సు చేసిన స్థలం ... కళ్యాణ మంటపం ... భక్త రామదాసు సీతారాములకు చేయించిన ఆభరణాల ప్రదర్శనశాల ... రంగనాయకుల గుట్టపై రామదాసు విగ్రహం యాత్రికులకు అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుంటాయి.

ఇక ఇక్కడి 'పర్ణశాల' ... 'సీతమ్మ వాగు' ... ఆమె వాడిన పసుపు కుంకుమ రాళ్లు ... జటాయు సంబంధమైన ఏటిపాక - రేకపల్లి ... రావణ గుట్ట ... లక్ష్మణగుట్ట ... భక్తులకు రామాయణ ఘట్టాలను గుర్తుకుతెస్తూ అలౌకిక మైన అనుభూతిని అందిస్తుంటాయి. ప్రతి యేటా 'చైత్ర శుద్ధ నవమి' రోజున అంగరంగ వైభవంగా ఇక్కడ జరిగే 'సీతారాముల కళ్యాణం' చూస్తే మనసు మంత్ర ముగ్ధమై పోతుంది ... జన్మ ధన్యమై పోతుంది.

More Bhakti Articles