అమరారామం

అమరారామం
పంచారామాలలో ఒకటైన 'అమరారామం' (అమరావతి) కృతయుగంలోనే ఆవిర్భవించిన విశిష్టమైన పుణ్యక్షేత్రం. పురాణాల్లో 'క్రౌంచతీర్థం'గా పేర్కొనబడిన ఈ ప్రాంతం, ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని అమరావతిగా అలరారుతున్నది. అమరేశ్వరుడిగా స్వామివారు పూజలు అందుకుంటున్న ఈ క్షేత్రానికి వేణుగోపాలస్వామి క్షేత్రపాలకుడు. ఇక్కడి శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్టించి ... అమరేశ్వరుడనే నామకరణం చేసి పూజించినట్టు స్థలపురాణం చెబుతోంది.

దేవతల గురువు బృహస్పతి ఆదేశం మేరకు అప్పట్లో ఈ శివలింగం చుట్టూ పరివార దేవతలను ప్రతిష్టించడం జరిగింది. అమరుల నివాస ప్రాంతంగా మారిన కారణంగా ఈ ప్రాంతానికి అమరావతి అనే పేరు వచ్చిందని కూడా చెప్పుకుంటూ వుంటారు. చాముండికా సమేతుడైన అమరేశ్వరుడు ఇక్కడ విశేష పూజలను అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇక్కడి స్వామివారు త్రిగుణాలకు అతీతుడు అనే భావాన్ని ఆవిష్కరించేలా మూడు ప్రాకారాలతో ఆలయం కనువిందు చేస్తుంటుంది. మొదటి ప్రాకారంలో ప్రణవేశ్వరుడు ... జ్వాలాముఖీ దేవి కనిపిస్తారు. మధ్య ప్రాకారంలో వినాయకుడు ... కాలభైరవుడు ... కుమారస్వామి ... ఆంజనేయస్వామి ... కొలువుదీరి ఉంటారు. ఇక ధ్వజ స్తంభం దగ్గరగా సూర్య భగవానుడు కొలువై కనిపిస్తాడు.

ఇక గర్భాలయంలో 15 అడుగుల ఎత్తులో ఔరా అనిపించేలా ఉన్న మహా శివలింగాన్ని దర్శించుకోవచ్చు. ఏనుగు దంతాల రంగులో కనిపించే ఈ శివలింగం అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో తలపై మేకు కొట్టినట్టు చెబుతారు. అందుకు సంబంధించిన ఆనవాళ్లు కూడా కనిపిస్తూ వుండటం విశేషం. వందల సంవత్సరాల నుంచి ఎంతోమంది రాజులు తరతరాలుగా ఈ స్వామివారిని దర్శించుకుని తరించారనడానికి తగిన ఆధారాలు వున్నాయి. ప్రతి యేటా విజయదశమి రోజున ... మహా శివరాత్రి పర్వదినం రోజున ఇక్కడ స్వామివారికి ... అమ్మవారికి అంగరంగ వైభవంగా కల్యాణోత్సవం జరిపించబడుతూ ఉంటుంది.

More Bhakti Articles