ఈ శక్తిపీఠంలో ఇదొక ఆచారం !

వివిధ క్షేత్రాలను దర్శించినప్పుడు అక్కడగల ఆచారవ్యవహారాలు తెలుస్తుంటాయి. అక్కడి ప్రధాన దైవాన్ని విశ్వసించే భక్తులు మొక్కుకునే తీరు ... మొక్కుబడులు చెల్లించుకునే పద్ధతులు మిగతా ప్రాంతాలవారికి కాస్త కొత్తగా అనిపిస్తుంటాయి ... ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అలాంటి అనుభూతిని కలిగించే క్షేత్రంగా మనకి 'నైనితాల్' కనిపిస్తుంది.

ఇక్కడి అమ్మవారిని భక్తులు 'నయనాదేవి' గా కొలుస్తుంటారు. 52 శక్తిపీఠాల్లో ఒకటిగా నైనితాల్ చెప్పబడుతోంది. సతీదేవి ఎడమ కన్ను ఈ ప్రదేశంలోపడి సరస్సుగా మారిపోయిన కారణంగా ఈ క్షేత్రానికి ఈ పేరు వచ్చిందని అంటారు. సాధారణంగా అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకున్న భక్తులు, తాము అనుకున్నది నెరవేరగానే కృతజ్ఞతా పూర్వకంగా ఆ తల్లికి వెండి .. బంగారు నేత్రాలను సమర్పిస్తుంటారు.

ఇక చాలామంది భక్తులు తమ మనసులోని కోరికను అమ్మవారికి చెప్పుకుని అది నెరవేరడం కోసం, అమ్మవారి మందిరానికి ఎదురుగా గల చెట్టుకి 'ఎర్రని వస్త్రం' కడుతుంటారు. తరతరాలుగా ఇక్కడ ఈ ఆచారం కొనసాగుతోంది. ఇలా అమ్మవారికి ఎదురుగా గల ఈ చెట్టుకి ఎర్రని వస్త్రాన్ని కట్టడం వలన మనోభీష్టం తప్పక నెరవేరుతుందని అంటారు. అమ్మవారి సన్నిధిలో గల చెట్టుకి ఎర్రని వస్త్రాన్ని సమర్పించే భక్తుల సంఖ్యను చూస్తే, అమ్మవారి పట్ల ... ఆచారం పట్ల వారికి గల విశ్వాసం ఎంత బలమైనదనే విషయం స్పష్టమవుతుంది.


More Bhakti News